MUNUGODE BYELECTION: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నిక రాబోతోంది. స్పీకర్ కు రాజగోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా సమర్పించలేదు. సమయం చూసుకుని స్పీకర్ ను కలుస్తానని చెప్పారు. రాజీనామా ప్రకటన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం పక్కానే. దీంతో ప్రధాన పార్టీలన్ని మునుగోడుపై ఫోకస్ చేశాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే అంచనాతో గత నెల రోజుల నుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఇక పీసీసీ ముఖ్య నేతలంతా శుక్రవారం మునుగోడుకు రాబోతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర రెండు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలోకి ఎంట్రీ కానుంది. ఇలా అన్ని పార్టీలు ప్రస్తుతం మునుగోడు కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మునుగోడుకు జరగనున్న ఉప ఎన్నికలో ఏం జరగనుంది.. నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ఎవరూ పోటీ చేయబోతునున్నారన్నది ఆసక్తిగా మారింది.
మునుగోడు గడ్డ మొదటి నుంచి పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. మొదటి నుంచి కమ్యూనిస్టుల కోట. వామపక్ష ఉద్యమాలకు ఊపిరిపోసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి నేతలు కీలకంగా వ్యవహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 27 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది ఓటర్లు బీసీ వర్గాలకు చెందినవారే. గౌడ్, యాదవ, పద్మశాలి, ముదిరాజ్ వర్గాల ఓటర్లు భారీగా ఉన్నారు. ఎస్టీ ఓటర్లు కీలకమే. గిరిజన ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రెడ్డి ఓటర్లు దాదాపు 15 వేల వరకు ఉన్నారు. మునుమగోడు నియోజకవర్గంలో రెడ్డీ నేతలదే మొదటి నుంచి హవా సాగుతోంది. మునుగోడు నుంచి ఇప్పటివరకు బీసీ నేతలు ఎమ్మెల్యే కాలేకపోయారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సార్లు బీసీ నేతను బరిలోకి దింపినా ఫలితం సాధించలేకపోయారు. మునుగోడు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్,చండూరు మున్సిపాలిటీలు ఉన్నాయి.
1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు కొండూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. మునుగోడు అసెంబ్లీకి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఐదు సార్లు కమ్యూనిస్టులు విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మునుగోడు పేరు చెప్పగానే వినిపించేది మాజీ మంత్రి దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇక్కడి నుంచి ఆదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలిచారు. ఆయన కుమారుడు యాదగిరి రావు ఒకసారి గెలిచారు. 2004లో సీపీఐ నుంచి పల్లా వెంకట్ రెడ్డి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2018లో మాత్రం రాష్ట్రమంతా కేసీఆర్ హవా వీచినా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.
మునుగోడు విషయంలో అన్ని పార్టీలు దూకుడుగా వెళుతున్నాయి. దుబ్బాక,హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితమే మునుగోడులో వస్తుందని బీజేపీ చెబుతోంది. నల్గొండ జిల్లాలో బీజేపీకి బలమే లేదని.. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతైందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో తమ గెలుపును ఎవరూ ఆపలేరని పీసీసీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. శుక్రవారం మునుగోడులో నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ ముఖ్య నేతంలతా హాజరుకానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక కోసం స్ట్రాటజీ కమిటి, ప్రచార కమిటీని నియమించింది. పీసీసీ ప్రచార కమిటి చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ కన్వీనర్ గా ఉన్న కమిటీలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, బలరాం నాయక్ , అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నారు. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ లు నెలకొంటున్నాయి.