Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు

BJP 24 Hours Deeksha at Hyderabad Dharna Chowk: తెలంగాణ పోరాటంలో ఎంతోమంది 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తమ చావుతో అయినా.. తెలంగాణ వస్తుందని ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులను వేధిస్తోందని మండిపడ్డారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 13, 2023, 03:36 PM IST
Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు

BJP 24 Hours Deeksha at Hyderabad Dharna Chowk: రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. వారికి సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్​ 24 గంటల ఉపవాస దీక్షలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాటం చేసింది రాష్ట్ర నిరుద్యోగ యువత అని అన్నారు. తొమ్మిదేళ్లుగా నిరుద్యోగ యువత విషయంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. 1969లో తెలంగాణ యువత ఉద్యోగాలు, భవిష్యత్​ విషయంలో అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 

"ఆ రోజు కాంగ్రెస్​ ప్రభుత్వ పోలీసు తూటాలకు 369 మంది బలయ్యారు. ఆరోజు కాల్చి చంపింది నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థులు చదువు మానేసి.. మాకు తెలంగాణ కావాలి, ఉద్యోగాలు కావాలని పోరాటం చేశారు. తెలంగాణ రాదేమోనని, కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ ఇవ్వదేమోనని 1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారు. నా చావుతోనైనా.. తెలంగాణ వస్తుందేమోనని ఆత్మబలిదానం చేసుకున్నారు. అందరికంటే ముందు.. కేసీఆర్​ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పెట్రోల్​ పోసుకున్నాడు.. ఆయనకు ఇంతవరకు అగ్గిపెట్టే  దొరకలేదు. కానీ ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల.. కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి.

ట్యాంక్‌బండ్‌ మిలియన్​ మార్చ్​, సాగరహారం, వంటావార్పు.. ఇదే ధర్నా చౌక్​లో ఏండ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారు. కానీ తొమ్మిదేండ్లుగా నిరుద్యోగ యువత పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. యూనివర్సిటీలు కళావిహీనంగా ఉన్నాయి. హాస్టళ్లలో పందికొక్కులు తిరుగుతున్నాయి. తెలంగాణ వస్తే.. వర్సిటీల్లో ఖాళీ లెక్చరర్ల పోస్టులు, స్కూళ్లు, కాలేజీల్లో టీచర్ల పోస్టులు భర్తీ అవుతాయని, తమకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. ఏండ్ల తరబడి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసులతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. పరీక్షలు నిర్వహించినా.. ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్​ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై.. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్​ ఆగమైంది.

తల్లిదండ్రుల వద్ద ఉన్న బంగారం అమ్మి, అప్పులు తీసుకొని నగరంలో కోచింగ్​ తీసుకొని, వీధి లైట్ల కింద, పార్కుల్లో పస్తులు ఉండి చదువుకొని పరీక్షలు రాస్తే.. ప్రశ్నపత్రాలు లీకై.. 35 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు ఆగమయ్యాయి. కేసీఆర్​ ఈ పాపం ఎవరిది..? 35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్​ తీసుకుంటే వారిని గాలికొదిలేశారు. నిరుద్యోగుల జీవితాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా..? దానిపై పోరాటం చేస్తే.. గతంలో మా అధ్యక్షుడు బండి సంజయ్​ మీద కేసులు పెట్టారు. సిగ్గు ఉండాలి మీ ప్రభుత్వానికి​.. మినిమమ్​ కామన్​ సెన్స్​ ఉండాలి. అవినీతి కుంభకోణాలు మీవి, చేతకాని తనం మీది, లీకేజీలు మీవి.. కేసులు మా మీద పెడతారా..? అసెంబ్లీలో కేసీఆర్​ ఏం చెప్పారు.. డీఎస్సీ వేస్తాం.. 25 వేల టీచర్​ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది..?" అని కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏ యువకులైతే తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాటం చేశారో.. వాళ్లు ఈరోజు కళ్లు తెరిచారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతరేస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీని ముందు పెట్టి.. ఆ​ పార్టీకి సాయం చేస్తూ గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ అని విమర్శించారు​. కానీ నిరుద్యోగ యువతకు తెలుసని.. ఈ రెండు పార్టీలను యువత క్షమించదన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం బీజేపీ పోరాటం చేస్తే.. కేసులు పెట్టి, జైళ్లకు పంపారని.. కానీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు కిషన్ రెడ్డి.

Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 15 వరకూ ఏపీలో భారీ వర్షాలు

Also Read: Chandrababu Case: హైకోరులో చంద్రబాబుకు నిరాశ, క్వాష్ పిటీషన్ విచారణ వారం వాయిదా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News