Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళుతున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కౌలు రైతుల పరామర్శలకు జిల్లాలు తిరుగుతున్నారు, వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు పొత్తులకు కూడా సిద్ధమని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి ఏపీ రాజకీయాల్లో కీరోల్ పోషించే దిశగా జనసేన చీఫ్ పావులు కదుపుతున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయాలపైనా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణలోనూ పోటీ చేసి తీరుతామని ప్రకటించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు పవన్ కల్యాణ్. చనిపోయిన జనసేన కార్యకర్తలను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకు వెళుతున్న పవన్ కళ్యాణ్ కు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. ఎల్బీనగర్ జంక్షన్ లో జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడ కాసేపు ఆగారు పవన్ కళ్యాణ్. తమ నేతను గజమాలతో సత్కరించారు ఎల్పీ నగర్ జనసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో పోటీపై స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల తెలగాణలో పోటీ చేయలేక పోయామని చెప్పారు. రానున్న ప్రతి ఎన్నికల్లో తెలంగాణలో జనసెన పార్టీ బరిలో ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపిచ్చారు పవన్ కళ్యాణ్.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అయితే ఏపీలో పొత్తుపై క్లారిటీ ఉన్నా.. తెలంగాణలో మాత్రం గందరగోళం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వబోమని మొదట ప్రకటించారు జనసేన చీఫ్. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వచ్చి చర్చలు జరపడంతో మనసు మార్చుకున్నారు. బీజేపీకి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తర్వాత కూడా తెలంగాణలో బీజేపీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో సైలెంటుగా ఉన్నారు. ఇటీవల జరిగిన బీమ్లానాయక్ సినిమా ఈవెంట్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందా లేక ఒంటరిగానే వెళుతుందా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. ఏపీలో పొత్తు ఉంది కాబట్టి.. తెలంగాణలోనే రెండు పార్టీలు కలిసిపోతాయనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా తెలంగాణలో పోటీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వడంతో జనసేన కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో జనసేన నుంచి పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. పవన్ ప్రకటనతో అలాంటి నేతలంతో యాక్టివ్ కానున్పారని చెబుతున్నారు.
READ ALSO:Nallala Odelu:ఈటల మిత్రుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరారు? బీజేపీలో ఏం జరుగుతోంది?
READ ALSO: Chandrababu Shock: టీడీపీకి కేఈ బ్రదర్స్ గుడ్ బై? కర్నూల్ జిల్లా తమ్ముళ్లలో కలకలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook