విమానాశ్రయం వరకు మెట్రో; పార్కింగ్‌లకు యాప్: కేటీఆర్

ఫలక్ నూమా నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Last Updated : Mar 21, 2018, 12:32 PM IST
విమానాశ్రయం వరకు మెట్రో; పార్కింగ్‌లకు యాప్: కేటీఆర్

హైదరాబాదు మెట్రోరైలు ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.14 వేల133 కోట్లలో ఇప్పటివరకు రూ.2 వేల 296 కోట్లు ఖర్చు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ వద్ద పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మెట్రో మార్గాల్లో రహదారి విస్తరణ పనులను వేగవంతం చేశామని అసెంబ్లీలో తెలిపారు. కొన్ని చోట్ల రోడ్ల వెడల్పు 200 అడుగుల మేర విస్తరిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ- ఫలక్ నూమా నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరిస్తామని అన్నారు. పాతబస్తీలోనూ ప్రాజెక్టు పనులు 100 శాతం పూర్తి చేస్తామని చెప్పారు.

అన్ని పట్టణాలలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ - పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. త్వరలో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు ఉంటుందని.. వీలైతే పబ్లిక్ స్థలాలను కూడా పార్కింగ్‌కి ఉపయోగిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్కింగ్ స్థలాలను పెంచడానికి ప్రతిపాదనలు పెట్టామని.. పార్కింగ్ స్థలాల గుర్తింపునకు స్మార్ట్ యాప్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Trending News