హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి నేడు జరుగుతున్న ఉప ఎన్నికలో భాగంగా నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గం పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 24న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్ యూనిట్‌తో గరిష్టంగా 15 మంది (నోటాతో కలిపి 16) అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,497 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పొల్గొంటున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,36,943 మంది ఓటర్లు ఉండగా అందులో 1,20,435 మంది మహిళలు, 1,16,508 మంది పురుషులు ఉన్నారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం స్థానిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలిచిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికవడంతో హుజూర్ నగర్ నుంచి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
శానంపూడి సైది రెడ్డి(టీఆర్‌ఎస్), నలమాద పద్మావతి రెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ కోటా రామా రావు (బీజేపీ), చావ కిరణ్మయి (టీడీపీ)తో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు.
హోరాహోరీగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ప్రారంభమైన ఓటింగ్