హైదరాబాద్‌లో భారీ వర్షం.. మ్యాన్ హోల్స్‌తో జర జాగ్రత్త !

హైదరాబాద్‌లో భారీ వర్షం.. మ్యాన్ హోల్స్‌తో జర జాగ్రత్త !

Last Updated : Sep 26, 2019, 10:56 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. మ్యాన్ హోల్స్‌తో జర జాగ్రత్త !

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దయింది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలిం నగర్‌, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, తార్నాక, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, బోడుప్పల్, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వర్షం నీరు రోడ్లపైకి పోటెత్తడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ అయింది. నగరంలోని పలు చోట్ల రోడ్లపైకి మోకాలి లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు, స్కూల్, కాలేజీ విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వారంతా రోడ్లపై భారీ వర్షంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఇదిలావుంటే, మరోవైపు జీహెచ్ఎంసి 13 రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించి లోతట్టు ప్రాంతాల్లో సహాయచర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఉన్నట్టయితే, వాటిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసి కమిషనర్ సూచించారు.

Trending News