'కరోనా వైరస్'.. ఢిల్లీ తెలుగు మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ తెలుగు మీడియాలో పని చేస్తున్న ఒక రిపోర్టర్‌కు కరోనా సోకిందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధానిలో పని చేస్తున్న మీడియా ప్రతినిధులపై తెలుగు రాష్ట్రాలు దృష్టిసారించాయి.
జర్నలిస్టు సంఘాలు కోరిన మీదట తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు, చికిత్స చేయించేందు కోసం తక్షణమే 12 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఢిల్లీలో ఉన్న తెలుగు పాత్రికేయులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆర్ధిక సాయం చేయడానికి, అండగా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన జర్నలిస్టు బ్యాంక్ అకౌంట్లో 75 వేల రూపాయలు జమ చేశామని చెప్పారు.
మరో ముగ్గురికి కూడా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి పరీక్షలు, చికిత్స కోసం అయ్యే ఖర్చులను భరించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు నిధులు మంజూరు చేశారు. అంతకు ముందు ఢిల్లీలో తెలుగు మీడియాలో కరోనా కలకలం గురించి మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం విలేకరులకు అండగా ఉంటుందని.. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.