GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ సరళి చూస్తుంటే..50 శాతం దాటే అవకాశాలు కన్పించడం లేదు. మరోవైపు పోలింగ్ సందర్బంగా అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ ( GHMC Polling ) జరుగుతోంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి జరుగుతున్న పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతి ( Ballot Paper ) లో జరుగుతున్న ఎన్నికలు కావడంతో పోలింగ్ ప్రక్రియకు కాస్త ఆలస్యమవుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ 22 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
గ్రేటర్ ఓటర్లలో ఈసారి చైతన్యం ఎందుకు లేదో అర్ధం కాని పరిస్థితి. బస్తీల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. 30-35 శాతం పోలింగ్ నమోదైంది. కానీ కాలనీల్లో మాత్రం 20 శాతం కూడా దాటలేదు. విద్యాధికులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇంకా 1 శాతం పోలింగ్ దాటని పరిస్థితి ఉంది.
2016లో కూడా అత్యల్పంగా 46 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా సాయంత్రానికి అదే పరిస్థితి ఎదురుకావచ్చని తెలుస్తోంది.
చెదురుముదురు సంఘటనలు
ఇక జీహెచ్ఎంసీ పోలింగ్ ( Polling ) సందర్బంగా అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఉప్పల్ 10వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల్లా పరమేశ్వరరెడ్డి సూర్యాపేట నుండి గుండాలను తీసుకొచ్చి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ..టీఆర్ఎస్ అభ్యర్థి షాలిని భాస్కర్ విమర్శించారు. రీ పోలింగ్ డిమాండ్ చేశారు. సంతోష్ నగర్ రియాసత్ నగర్ డివిజన్లో బుర్కా ధరించి ఓట్లు వేయడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంక్ మార్క్ చెరిపేసుకుని మహిళలు మళ్ళీ ఓట్లు వేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బూత్ నెంబర్ 60, 61లలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఇలా పలుచోట్ల రిగ్గింగ్ ఆరోపణలు, ఇంకొన్ని చోట్ల బోగస్ ఓట్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో రీ పోలింగ్ జరపనున్నట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. Also read: GHMC Elections: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం