ఇంటి విద్యుత్ బిల్లు రూ. 3.81 లక్షలు.. కన్సూమర్‌కి 'కరెంట్ షాక్'!

రూ.3.81 లక్షల బిల్లుతో షాక్ ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులు

Last Updated : Jun 13, 2018, 05:36 PM IST
ఇంటి విద్యుత్ బిల్లు రూ. 3.81 లక్షలు.. కన్సూమర్‌కి 'కరెంట్ షాక్'!

హైదరాబాద్‌లో ఓ సాధారణ ఇంటి యజమానికి రూ.3.81 లక్షల బిల్లు చూపించి విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. బోడుప్పల్‌లోని శ్రీనివాస నగర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాస నగర్‌కి చెందిన స్వరూప అనే మహిళ ఇంటికి ఇటీవల రూ.3,81,571 విద్యుత్ బిల్లు వచ్చింది. సాధారణ ఇంటికి లక్షల్లో బిల్లు రావడం చూసి ఘొల్లుమన్న స్వరూప మంగళవారం మధ్యాహ్నం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులని సంప్రదించి తన గోడు వెళ్లబోసుకున్నారు. వాణిజ్య సంస్థకు ఇచ్చినంత బిల్లును ఓ సాధారణ ఇంటికి ఎలా ఇస్తారని ఆమె అధికారులని నిలదీయంతో ఆ బిల్లును చూసి అవాక్కవడం అక్కడి అధికారుల వంతయ్యింది. విద్యుత్ శాఖ ఇచ్చిన బిల్లు ప్రకారం మే 9వ తేదీ నుంచి జూన్ 10 వరకు వినియోగించిన విద్యుత్ మొత్తం 40,059 యూనిట్స్‌గా అందులో పేర్కొని ఉంది. విద్యుత్ చార్జీల కింద రూ. 3,79,087 సుంకం కింద అదనంగా రూ.2,403 కలిపి మొత్తం రూ.3,81,571 జూన్ 24వ తేదీలోగా చెల్లించాల్సిందిగా విద్యుత్ బిల్లు వివరాలు స్పష్టంచేస్తున్నాయి.

బాధితురాలి ఫిర్యాదు అనంతరం మరోసారి ఆమె ఇంట్లో మీటర్ రీడింగ్ తనిఖీ చేసిన విద్యుత్ శాఖ అధికారులు వాస్తవానికి కేవలం 63 యూనిట్స్ విద్యుత్ మాత్రమే ఖర్చయినట్టుగా గుర్తించారు. అనంతరం ఆమెకు రూ.134 మొత్తంతో ఓ కొత్త బిల్లు ఇచ్చారు. మీటర్ రీడింగ్ నమోదు చేయడంలో సిబ్బంది చేసిన తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగినట్టుగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు. 

Trending News