ఢిల్లీ: రెండో రోజు కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ సమావేశం వాడీ వేడిగా జరుగుతోంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ అగ్రనేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు తెలిసింది. ఈ భేటీలో ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు పోటా పోటీ ప్రతిపాదనలు పెడుతున్నారు. రేవంత్ ప్రతిపాందించిన అభ్యర్ధులను టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా ఆయా స్థానాల్లో తాను సూచించిన అభ్యర్ధులను బరిలోకి దించాలని పీసీసీ చీఫ్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇరువురు నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరి కొన్ని సీట్ల విషయంలో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో షబ్బీర్ అలీ, విజయశాంతి కూడా విభేదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇంకా 10 సీట్లు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. సాయంత్రానికి కల్లా సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.