Woman cheated by social media friend on instagram: హైదరాబాద్: సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేసి ఆ తర్వాత వారి చేతుల్లోనే దారుణంగా మోసపోతున్న ఘటనలు కోకొల్లలు చోటుచేసుకుంటున్నప్పటికీ... ఇంకా కొంత మంది మాత్రం ఆ అనుభవం స్వయంగా తమకే ఎదురయ్యే వరకు ఆ అవివేకం నుంచి తేరుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలో నివసించే ఒక 31 ఏళ్ల యువతికి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆ యువతి కొంతకాలం క్రితం తన భర్తను కోల్పోయారు. ఆమెకు ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో 'ఎరిక్ స్మిత్' అనే పేరుతో ఓ కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని చెప్పి ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దికాలంలోనే ఇద్దరు మంచి స్నేహితులు (Social media friends) అయ్యారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 11న ఎరిక్ స్మిత్ తాను టర్కీ వెళ్లినట్లు ఆమెకు ఓ మెసేజ్ పంపించాడు. స్వతహాగా సివిల్ ఇంజనీర్‌ని అయిన తాను ఇస్తాంబుల్‌లో ఇళ్లను నిర్మించి విక్రయించేందుకు వచ్చానని యువతిని నమ్మించాడు. ఆ తర్వాత మరో రెండ్రోజులకే తన పర్సు పోగొట్టుకున్నానని, ఇస్తాంబుల్‌లో ఇళ్ల నిర్మాణం కోసం డబ్బులు అవసరం పడ్డాయని చెప్పి అప్పుడు కొంత, అప్పుడు కొంత మొత్తం రూ.17 లక్షలు వరకు యువతి నుంచి ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ (Online money transfer) చేయించుకున్నాడు.
ఆ తర్వాత యువతికి అనుమానం రావడం మొదలవడంతో అతడి నుంచి సమాధానం కరువైంది. దీంతో తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు తాజాగా సైబరాబాద్ పోలీసులను (Cyberabad police) ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ చట్టాలతో పాటు (Cyber crimes) యువతిని మోసం చేసినందుకు పలు ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు.. ఎరిక్ స్మిత్ పేరిట యువతిని మోసం చేసిన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు చెప్పిన విషయం విని షాక్ అవడం యువతి వంతయ్యింది.