హైదరాబాద్: కాంగ్రెస్ తరపున గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల బాటలోనే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కూడా త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తానని, నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరతానని జగ్గా రెడ్డి చేసిన ప్రకటనే ఆయన పార్టీ మారనున్నారా అనే ప్రచారాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సంగారెడ్డికి ఒక మెడికల్ కాలేజ్, 40వేల మందికి ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించాలని కేసీఆర్‌ను కోరుతానని తెలిపారు.
గతంలో అనేక సందర్భాల్లో ఇలా నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసిన కొంత మంది ఎమ్మెల్యేలు ఏకంగా అధికార పార్టీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు జగ్గారెడ్డి కూడా సీఎం కేసీఆర్ ను కలిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇదిలావుంటే, కేసీఆర్, కేటీఆర్ బంధువులు టీఆర్ఎస్‌లోకి రావాలని తనను ఆహ్వానిస్తున్నారని ఎన్నికలకు ముందు జగ్గారెడ్డి చేసిన ఓ సంచలన ప్రకటన ఇక్కడ నేతలు, రాజకీయ పరిశీలకులు గుర్తుచేసుకుంటున్నారు. మే 25 నుంచి 30వ తేదీ లోపు తాను గాంధీభవన్‌లో ఉంటానో లేక టీఆర్ఎస్ భవన్‌లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుందని అప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయా పరిణామాల నేపథ్యంలో తాజాగా త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తానని జగ్గారెడ్డి చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది.