"వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది" అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇది నా స్వప్నం అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన దేశంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా ప్రారంభించాం. దశాబ్దాల పాటు కరెంట్ కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురని చెప్పారు.
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై బుధవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- " 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా తలెత్తే పరిస్థితులను వారం రోజుల్లోపు అధ్యయనం చేసి, వచ్చే రబీ నాటికి శాశ్వత ప్రాతిపదికన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం, విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. రైతులు వ్యవసాయ పంపుసెట్లకు బిగించిన ఆటోస్టాటర్లను తొలగించాలి. కరెంట్ ఆదా కోసం అని నేను అలా చెప్పడం లేదు. భాగర్భజలాలను కాపాడుకుందామని విన్నవిస్తున్నా" అని ఆయన రైతులను కోరారు.