Midterm Elections in Telangana: కొంతకాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయడం పక్కా అని మీడియాలో తెగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ ముహూర్తం ఎప్పుడనేది మాత్రం ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని... ముందస్తుకు వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశముందని... పీకే టీమ్ కేసీఆర్‌కు రిపోర్ట్ ఇచ్చిందట. ఎంత త్వరగా అసెంబ్లీని రద్దు చేస్తే అంత మంచిదని సూచించిందట. దీంతో కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అలా అయితేనే విపక్షాలపై పైచేయి సాధించగలమని.. వారు కుదురుకునే లోగా ఎన్నికల బరిలో దూకితే ఫలితాలు కూడా అనుకూలంగా వస్తాయని అనుకుంటున్నారట.
ఇటీవల బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా పోరాటాలు చేస్తున్నాయి. ఓ వైపు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రతో ప్రజలకు దగ్గరవుతుంటే.. మరో వైపు రేవంత్‌రెడ్డి కూడా దూకుడు పెంచారు. ఇక బీజేపీ .. కేసీఆర్ కుటుంబ అవినీతిపై గట్టిగా ఫోకస్ చేసింది. ఈ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావడం ఈ మధ్య సంచలనం సృష్టించింది. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో పాటు బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే తనకు బ్యాడ్‌టైమ్ తప్పదని భావిస్తున్నారట కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పూర్తిస్థాయిలో కదనరంగంలోకి దూకకముందే అసెంబ్లీని రద్దు చేసి వచ్చే ఏడాది మార్చి, ఎప్రిల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారట. పీకే టీమ్ కూడా ముందస్తే మంచిదని సలహా ఇవ్వడంతో కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
నిజానికి కేసీఆర్ ఈ నెలలోనే అసెంబ్లీ రద్దు చేసి ఈ ఏడాది డిసెంబర్లో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ముందస్తు ఎలక్షన్స్ జరిగేలా ప్లాన్ చేశారట. అయితే కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్ పడటంతో కాస్త వెనకడుగు వేశారట. ముఖ్యంగా కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ ఇంకా పూర్తికాలేదు. దసరా నాటికి పనులు పూర్తిచేయాలని అనుకున్నా.. ప్రస్తుతం అది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇప్పటికే సెక్రటేరియట్ నిర్మాణంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. విశాలంగా ఉన్న పాత సెక్రటేరియట్‌ను అనవసరంగా కూల్చేశారని ఫైరవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే సెక్రటేరియట్‌ను ప్రజాసంక్షేమంకోసం హాస్పిటల్‌గా ఉపయోగిస్తామని కూడా అంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోనిది జరిగి తాము అధికారంలోకి రాకున్నా.. సెక్రటేరియట్ లో మాత్రం కార్యకలాపాలు ప్రారంభమవ్వాలని సీఎం కేసీఆర్ ధృఢనిశ్చయంతో ఉన్నారట. అందుకే అసెంబ్లీ రద్దుచేసేముందే సెక్రటేరియట్‌ను ప్రాంరభించాలని భావిస్తున్నారట. దసరా నాటికి పూర్తిస్థాయిలో సెక్రటేరియట్ నిర్మాణం పూర్తికాకుకన్నా.. కనీసం సీఎం ఛాంబర్ ఉన్న ఆరోఫ్లోరైనా కంప్లీట్ చేసి అక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేయాలనిన కేసీఆర్ ఆలోచనగా ఉందట. అందుకు తగ్గట్లే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారట కేసీఆర్. సీఎం ఆఫీస్ ఉండే ఆరోఫ్లోర్ను ముందు ప్రారంభిస్తే కేసీఆర్ అనుకున్న మంచి జరుగుతుందని... సిద్ధాంతులు కూడా కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం.
దసరా నాటికి సెక్రటేరియట్లో సీఎం ఛాంబర్ ప్రారంభించి.. కొన్నాళ్లు అక్కడ కార్యకలాపాలు నిర్వహించి డిసెంబర్ తర్వాత అసెంబ్లీ రద్దు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ఆలోపు డిసెంబర్ లో వచ్చే గుజరాత్ ఎన్నికల్లో రైతు సంఘాల నేతలు బరిలో దింపి బీజేపీకి షాక్ ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందట. అందుకు తగ్గట్లే కేసీఆర్ ఇటీవల... రైతు సంఘాల నేతలతో భేటీ అయి ఈ అంశంపై చర్చించారట. ఆ భేటీ ముగిసాకే బీజేపీ ముక్త్ భారత్ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు కేసీఆర్. ఇక మునుగోడు బై ఎలక్షన్ కూడా డిసెంబర్ లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. అక్కడ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం టీఆర్ఎస్కే లీడ్ ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు కేసీఆర్‌కు చెప్పాయట. ఇక ఆ బై ఎలక్షన్లోనూ గెలిస్తే ... టీఆర్ఎస్కు తిరుగుండదని.. ముందస్తులోనూ మంచి లీడ్ వస్తుందనేది కేసీఆర్ ప్లాన్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా వచ్చే ఏడాది ప్రారంభంలోగా దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.
Also Read : CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్..నితీష్ కుమార్‌తో కీలక మంతనాలు..!
Also Read : Revanth Reddy: మామా, అల్లుళ్లే హంతకులు.. ఇబ్రహీంపట్నం ఘటనపై కేసీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి ఫైర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి