తెలంగాణలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల మధ్య జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ దూరంగా వుంటున్నట్టు స్పష్టంచేసింది. పార్టీ అధినాయత్వం నుంచి అందిన పలు సూచనల మేరకు బీజేపీ తెలంగాణలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణలో మూడు స్థానాల కోసం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో ముగ్గురు అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ బరిలో నిలపగా మరొక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ సైతం ఈ ఎన్నికల్లో పాల్గొనడం లేదు. బీజేపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోతుండటంతో తెలంగాణలో మూడు స్థానాలు టీఆర్ఎస్ వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌కి మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ మద్దతు టీఆర్ఎస్‌కి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా మారింది.