తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి : బీజేపీ డిమాండ్

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి : బీజేపీ డిమాండ్

Last Updated : Dec 21, 2018, 12:51 PM IST
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి : బీజేపీ డిమాండ్

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెల్లడై నేటికి 10 రోజులు పూర్తవుతోంది. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ప్రతిపక్షాలు మాత్రం ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ముక్తకంఠంతో ఆరోపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను కలిసిన బీజేపీ నేతలు ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి, మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి తాను పోటీ చేసిన అంబర్‌పేట్ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ తీరే నిదర్శనం అని కిషన్ రెడ్డి విన్నవించుకున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం సెగ్మెంట్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 20,448 నివాసాలకు కేవలం ఒకే ఒక్క ఓటు ఉందని, అదెలా సాధ్యం అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీతో కుమ్మక్కైన అధికారులు.. బోగస్ ఓట్ల ఏరివేత పేరుతో బీజేపి మద్దతుదారుల ఓట్లు తొలగించి, టీఆర్ఎస్ మద్దతుదారుల ఓట్లు మాత్రమే తొలగించకుండా ఉంచారని రజత్ కుమార్‌కి మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు బీజేపీ నేతలు రజత్ కుమార్‌కు ఓ వినతిపత్రం కూడా అందజేశారు.  

Also read : మీ ఓటు హక్కు గల్లంతయ్యిందా ? ఓటర్ ఐడీ వివరాల్లో తప్పులున్నాయా ? అయితే ఇది మీకోసమే..

అయితే, తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను ఎన్నికల సంఘం మాత్రం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్, అక్రమాలు అసాధ్యం అని ఈసీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది.

Trending News