స్ట్రాబెర్రీలకు, వింబుల్డన్‌‌కు సంబంధమేమిటి?

వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లు ఎప్పుడు ఎక్కడ జరిగినా.. ఆ ప్రాంతంలో లెక్కలేనన్ని స్ట్రాబర్రీలు, ఐస్‌క్రీములు రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ ఉంటాయట.

Last Updated : Jul 5, 2018, 04:33 PM IST
స్ట్రాబెర్రీలకు, వింబుల్డన్‌‌కు సంబంధమేమిటి?

వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లు ఎప్పుడు ఎక్కడ జరిగినా.. ఆ ప్రాంతంలో లెక్కలేనన్ని స్ట్రాబర్రీలు, ఐస్‌క్రీములు రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ ఉంటాయట. ఈ మధ్యకాలంలో కూడా వింబుల్డన్ టోర్నమెంట్లు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్‌‌లో స్ట్రాబెర్రీ కూడా ప్రాచుర్యం పొందుతోంది. వింబుల్డన్ పేరును ట్యాగ్ చేసేవారిలో చాలామంది స్ట్రాబెర్రీ పేరును కూడా ట్యాగ్ చేస్తున్నారు.

ఇంతకీ వింబుల్డన్ ప్రియులకు స్ట్రాబెర్రీ పండ్లు అంత బాగా నచ్చడానికి కారణమేమిటా..అని పలువురు పరిశోధన చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయట. 1509లో తొలిసారిగా ఎనిమిదవ హెన్రీ పాలనలో ఆయన అధికారిక కార్యక్రమాల్లో విందుతో పాటు స్ట్రాబెర్రీలు కూడా సర్వ్ చేయడం మొదలుపెట్టేవారట. ఆయన తదనంతరం ఆయన వారసుడొకరు 1877లో వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి వెళ్లి.. అక్కడే డిన్నర్‌కి హాజరైనప్పుడు మైదానంలో అందరికీ స్ట్రాబర్రీలు, ఐస్ క్రీములు ఉచితంగా సర్వ్ చేశారట.

ఏ ముహుర్తాన ఆ రోజు అవి సర్వ్ చేశారోగానీ.. ఆ తర్వాత ప్రతీ వింబుల్డన్ టోర్నమెంట్‌లో కూడా వాటి అమ్మకం అనేది ఆనవాయితీగా రాసాగింది. 2017లో జరిగిన వింబుల్డన్ టోర్నమెంటు చూడడానికి వచ్చిన ప్రేక్షకులు దాదాపు ఒక్క రోజులోనే 34,000 కేజీల స్ట్రాబెర్రీలు, 10,000 లీటర్ల ఐస్ క్రీములు తిన్నారని అంచనా.

వింబుల్డన్‌లో అమ్మే స్ట్రాబెర్రీలను కూడా టోర్నమెంటు జరగుతున్న సమయాల్లో ఉదయం 5 గంటల  ప్రాంతంలో ప్రత్యేకంగా చాలా దూరంలో ఉన్న కెంట్ ప్రాంతం నుండి తెప్పిస్తుంటారట. ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్లలో వింబుల్డన్ కూడా ఒకటనే సంగతి మనకు తెలిసిందే.

Trending News