అంత పెద్ద క్రికెట్ లెజెండ్ కూడా కుర్రాడిలా మారిపోయాడు. కేవలం తన ఫ్యాన్స్ కోసం గల్లీకి వచ్చి మరీ క్రికెట్ ఆడాడు. సోమవారం రాత్రి సరదాగా కొందరు సామాన్యమైన కుర్రాళ్లతో సచిన్ ఆడిన క్రికెట్ ఆటను మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి షూట్ చేశారు. ఆ తర్వాత ట్విటర్లో పోస్టు చేశారు. ఈ క్రికెట్ ఆటలో సచిన్ బ్యాక్ ఫుట్ డిఫెన్స్ షాట్లు ఆడడం విశేషం.
Here is complete video of @sachin_rt street cricket yesterday in #Bandra 😍 pic.twitter.com/gihlljoA1O
— Sachinist.com (@Sachinist) April 16, 2018
ఆ తర్వాత తను క్రికెట్ ఆడిన కుర్రాళ్లతో కలిసి సెల్ఫీలు తీసుకోవడంతో పాటు ఆటోగ్రాఫులు కూడా ఇచ్చాడు ఈ లిటిల్ మాస్టర్. ప్రస్తుతం ఐపీఎల్ సీజనులో సచిన్ ముంబయి ఇండియన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో సచిన్ తనను తాను బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు సామాన్య జనంతో మమేకమవ్వడానికి సిద్ధమవుతున్నారు.
@sachin_rt. Master Blaster good to See you enjoying like Old times 😘😘😘 pic.twitter.com/9I96AcfKfG
— VINOD KAMBLI (@vinodkambli349) April 16, 2018
మాస్టర్ బ్లాస్టర్ అని పిలవబడే సచిన్ టెండుల్కర్ 1989లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా కూడా ఆయన నిలిచాడు. 2012, మార్చి 16వ తేదిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో సచిన్ కొత్తరికార్డు సృష్టించి తన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాడు. 2014 సంవత్సరంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను సచిన్ టెండుల్కర్ ఆయన క్రీడావిరమణ సందర్భంగా స్వీకరించారు.