మహమ్మద్ సిరాజ్ ఇంట్లో కొహ్లీ టీమ్ సందడి

టోలీచౌకిలో ఉన్న హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సిరాజ్‌ ఇంటికి మధ్యాహ్నం కోహ్లీ సేన వెళ్ళి పసందైన హైదరాబాద్‌ బిర్యానీ తిన్నారు.

Last Updated : May 8, 2018, 10:32 AM IST
మహమ్మద్ సిరాజ్ ఇంట్లో కొహ్లీ టీమ్ సందడి

సోమవారం సన్‌‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ఆర్‌సీబీ టీమ్‌ హైదరాబాద్‌‌కు వచ్చింది. టోలీచౌకిలో ఉన్న హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సిరాజ్‌ ఇంటికి కోహ్లీ సేన వెళ్ళి పసందైన హైదరాబాద్‌ బిర్యానీ తిన్నారు. బిర్యానీతో పాటు పలు వంటకాలను రుచి చూశారు. హైదరాబాద్‌ బిర్యానీపై కొహ్లీ ప్రశంసలు జల్లు కురిపించాడు.  

హైదరాబాద్‌ బిర్యానీ అంటే దేశ, విదేశాల్లోని నాన్‌వెజ్‌ ప్రియులు లొట్టలు వేసుకుంటూ తింటారని అందరికి తెలిసిందే. హైద రాబాద్‌కు వచ్చిన వారు ఇక్కడ బిర్యానీ తినకుండా ఉండలేరు. తాజాగా హైదరాబాద్‌ బిర్యానికి విరాట్‌ కోహ్లీ ఫిదా అయ్యాడు.

జట్టు సభ్యులతో పాటు కోహ్లీ తన ఇంటికి రావడంతో సిరాజ్‌ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వెంటనే కోహ్లీకీ, టీమ్‌ సభ్యులకు ఘుమఘుమలాడే బిర్యానీతోపాటు కబాబ్స్‌తో విందు ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. సుమారు రెండు గంటల పాటు సిరాజ్‌ ఇంట్లో గడిపిన కొహ్లీ ఆ తరువాత బస చేసే హోటల్‌కు చేరుకున్నాడు. అయితే భద్రత దృష్ట్యా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ప్రత్యేక పోలీసు బృందం క్రికెటర్లకు సెక్యూరిటీ ఇచ్చింది.

అటు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొహ్లీ (4, 818 పరుగులు) అగ్రస్థానానికి చేరగా రైనా (4,801 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.

బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు

మరోసారి హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుత విజయం సాధించింది. 147 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి రెండు ఓవర్లనూ కౌల్, భువనేశ్వర్‌లు అద్భుతంగా చేసి ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చివరి బంతికి భువనేశ్వర్ బౌలింగ్‌లో గ్రాండ్ హోమ్ క్లీన్ బౌల్డయ్యాడు.

Trending News