Team India: డియర్ క్రికెట్ మరో అవకాశం ఇవ్వు.. సెలక్టర్ల నిర్లక్ష్యంపై టీమిండియా క్రికెటర్ సెటైర్

Karun Nair Tweet Viral: టీమిండియా తరుఫున అరంగేట్రం చేసి.. ఆరంభంలో మెరుపులు మెరిపించి ఆ తరువాత కనుమరుగైన క్రికెటర్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వీరిలో కొందరికి మళ్లీ అవకాశాలు రాకపోగా.. మరికొందరు వచ్చినా వినియోగించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఓ క్రికెటర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 01:19 PM IST
Team India: డియర్ క్రికెట్ మరో అవకాశం ఇవ్వు.. సెలక్టర్ల నిర్లక్ష్యంపై టీమిండియా క్రికెటర్ సెటైర్

Karun Nair Tweet Viral: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఢాకాలో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైన టీమిండియా.. చిట్టగాంగ్‌లో జరిగిన మూడో వన్డేలో 227 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ డబుల్ సెంచరీతో చెలరేగి ఆడాడు. ఈ నేపథ్యంలో మరో క్రికెటర్ తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశాడు. గత ఐదేళ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న కరుణ్ నాయర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కర్ణాటక జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కరుణ్ నాయర్ 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. తన చివరి మ్యాచ్‌ను 2017లో ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు జట్టులో చోటు‌ కోసం ఎదురుచూస్తున్నాడు. శనివారం ఈ క్రికెటర్ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ.. ఒక ట్వీట్ చేశాడు. 'డియర్ క్రికెట్.. నాకు మరో అవకాశం ఇవ్వు..' అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కరుణ్ నాయర్‌కు అండగా నిలుస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. కచ్చితంగా అవకాశం వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఆరేళ్ల క్రితం ట్రిపుల్ సెంచరీ..

కరుణ్ నాయర్ 2016లో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన మూడో టెస్టులో బలమైన ఇంగ్లండ్ జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారత్‌ నుంచి రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే టీమిండియా తరపున ఈ మార్క్ సాధించాడు.

కరుణ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సహా మొత్తం 374 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో అతను 2 మ్యాచ్‌ల్లో 46 పరుగులు చేశాడు. అతను జూన్ 2016లో హరారేలో జింబాబ్వేపై తన వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కానీ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. 

జట్టులో కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా.. వాళ్లను జట్టులో అలాగే కొనసాగిస్తూ అవకాశాలు ఇస్తున్నారు. కానీ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిని మాత్రం వెంటనే పక్కన పెట్టేసింది. బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌కు జయదేవ్ ఉనద్కట్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలె అతను 'డియర్ రెడ్ బాల్.. నాకు మరో ఛాన్స్ ఇవ్వు..! ఈ సారి నిన్ను గర్వపడేలా చేస్తా..' అంటూ ట్వీట్ చేశాడు. ఆ తరువాత జట్టులో ఛాన్స్ దక్కింది. జయదేవ్‌ను ఫాలో అవుతూ కరుణ్ నాయర్ కూడా 'డియర్ క్రికెట్.. నాకు మరో అవకాశం ఇవ్వు..' అంటూ ట్వీట్ చేశాడు.

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  

Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News