బోల్తా పడ్డ టీమిండియా.. శ్రీలంక ఘన విజయం

ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టుపై శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. 176 బంతులు ఉండగానే.. శ్రీలంక ఈ విజయాన్ని నమోదు చేయడం విశేషం

Last Updated : Dec 11, 2017, 12:59 PM IST
బోల్తా పడ్డ టీమిండియా.. శ్రీలంక ఘన విజయం

ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టుపై శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. 176 బంతులు ఉండగానే.. శ్రీలంక ఈ విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (49; 46 బంతుల్లో 10×4) దూకుడుకి తోడు ఏంజెలో మాథ్యూస్‌ (25; 42 బంతుల్లో 5×4), నిరోషన్‌ డిక్వెలా (26; 24 బంతుల్లో 5×4) కూడా తమ వంతు బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించడంతో, శ్రీలంక జట్టు 112 పరుగుల లక్ష్యాన్ని చాలా తేలికగా చేరుకోగలిగింది.

నెమ్మదిగా ఆడుతూ, కేవలం మూడే వికెట్లు కోల్పోయి 38.2 ఓవర్లలో విజయ తీరాన్ని చాలా సులువుగా చేరింది. అంతకు ముందు బరిలోకి దిగిన భారత్ జట్టులో ధోని ఒక్కడే నిలకడగా ఆడి 87 బంతుల్లో 65 పరుగుల చేయగలిగాడు. కేవలం 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్, మరీ తక్కువ స్కోరుకి ఔటవుతుందా అని సగటు అభిమాని ఆందోళన పడుతుండగా.. ఆ భారాన్ని మొత్తం భుజాన వేసుకున్న ధోని చాలా జాగ్రత్తగా పరుగులను రాబట్టాడు.

ఆఖరి వరకు గ్రీజ్‌లోనే ఉన్న ధోని, భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. లేదంటే టీమిండియా స్కోరు కనీసం 170 - 180 వరకూ చేరుండేది. శ్రీలంక బౌలర్ సురంగ లక్మల్ ప్రధానమైన నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు విజయానికి కారణమయ్యాడు.  

Trending News