సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ సొంతం చేసుకోవాలన్న భారత్ కల నెరవేరింది. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా సఫారీలతో మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన 5వ వన్డేలో టీమిండియా 73 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో వన్డే మిగిలి వుండగానే వన్డే సిరీస్ టీమిండియా సొంతమైంది.
మొదట టాస్ గెలిచిన సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు మాత్రం ఆది నుంచే తడబడుతూ వచ్చారు. హషీమ్ ఆమ్ల 71 (92 బంతుల్లో 4x5) మినహాయించి మిగతా ఆటగాళ్లు ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ మార్కుని కూడా అందుకోలేకపోయారు. ఆమ్లా తర్వాత క్లాసెన్(39) డేవిడ్ మిల్లర్ (36), మర్కం (32) మినహాయించి మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
ఇదిలావుంటే మరోవైపు టీమిండియా బౌలర్ల వైపు నుంచి 10 ఓవర్లు వేసిన కుల్దీప్ 57 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా ఆమ్లా, ఏబీ డివిలియర్స్ లాంటి కీలక ఆటగాళ్ల వికెట్లని పడేయడంలో హార్ధిక్ పాండ్య సక్సెస్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయసంగానే విజయం సాధించింది.