Afghan Cricket: ప్రపంచకప్ 2023లో ఏ మాత్రం అంచనాల్లేకుండా అడుగెట్టిన ఆఫ్ఘనిస్తాన్ అద్భుతాలు చేసింది. సెమీస్ బర్త్ కోసం చివరి వరకూ పోటీ పడి నిష్క్రమించినా మేటి జట్లను ఓడించి శెహబాష్ అన్పించుకుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌ను ఇకపై మేటి జట్ల జాబితాలో చేర్చాలంటున్నారు మాజీ క్రికెటర్లు.
ప్రపంచకప్ 2023లో లీగ్ దశ ఇవాళ్టితో ముగుస్తోంది. ఇక మిగిలింది రెండు సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ పోరు మాత్రమే. మొదటి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నవంబర్ 15న, రెండవ సెమీఫైనల్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బర్త్ వరకూ పోరాడి చివరి నిమిషంలో తప్పుకుంది. 9 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది. అప్పటికే మాజీ ఛాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించింది. ఆస్ట్రేలియాపై కూడా దాదాపు విజయం చేరువకు వచ్చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఊహించని ప్రదర్శనతో 7వ వికెట్‌కు నెలకొల్పిన భారీ భాగస్వామ్యం కారణంగా ఓడిపోవల్సి వచ్చింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఉంటే కచ్చితంగా సెమీస్ బర్త్‌కు చేరుండేది.
ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్, శ్రీలంక జట్లపై లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. చివరి మ్యాచ్‌లో కూడా దక్షిణాఫ్రికాను ఓడించినంత పనిచేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ అద్భుతంగా మెరుగుపడింది. ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ 9 మ్యాచ్‌లలో 47 సగటుతో 376 పరుగుల చేశాడు. అజ్మతుల్లా 8 ఇన్నింగ్స్‌లు ఆడి 70 సగటుతో 353 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ హష్మతుల్లా షాహిది 310 పరుగులు, రహ్మత్ షా 320 పరుగులు, గుర్బాజ్ 280 పరుగులు చేశారు. అంటే దాదాపుగా అందరూ రాణించారు.
ఇక బౌలింగ్ కూడా అద్భుతంగా సాగింది. రషీద్ ఖాన్ 11 వికెట్లు, మొహమ్మద్ నబి 8 వికెట్లు, నవీనుల్ హక్ 8 వికెట్లు, ముజీబుర్ రెహ్మాన్ 8 వికెట్లు సాధించారు. మొత్తం టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అత్యద్భుతం. ఆఫ్ఘన్ సామర్ధ్యం ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన మ్యాచ్ అది. మొదట బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై 291 పరుగులు చేసింది. ఇక తరువాత ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్లను 20 ఓవర్లు దాటకుండానే 91 పరుగులకు 7 మందిని పెవిలియన్ బాటపట్టించింది. ఆ తరువాత ఆస్ట్రేలియా అదృష్టం మ్యాక్స్‌వెల్ ఊహించని ప్రదర్శనతో ఆఫ్ఘన్ చివరి వరకూ పోరాడి ఓడింది.
అందుకే ఇక నుంచి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో పసికూన కాదు. మేటి క్రికెట్ జట్ల జాబితాలో ఆఫ్ఘన్‌ను చేర్చి పలకాల్సిందే. ఎందుకంటే ఆఫ్ఘన్ ఈ ప్రపంచకప్‌లో గెలిచిన మ్యాచ్‌లు అన్నీ పూర్తిగా సమిష్ఠి ఆటతీరుతో సాధించినవే. అందుకే మాజీ క్రికెటర్లంతా ఆఫ్ఘన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook