క్రికెటర్ల ఎంపికలో కుల రిజర్వేషన్ ఉండాలా..? మీడియాపై మహ్మద్ కైఫ్ ఆగ్రహం

భారతదేశంలో టీమిండియా టెస్టు క్రికెటర్ల ఎంపికలో కుల రిజర్వేషన్ లేదని.. అదే ఆఫ్రికా విషయానికి వస్తే అక్కడ క్రీడల్లో కూడా రిజర్వేషన్ ఉంటుందని ఇటీవలే ఓ వెబ్ సైట్ వెల్లడించింది

Last Updated : Jul 30, 2018, 03:04 PM IST
క్రికెటర్ల ఎంపికలో కుల రిజర్వేషన్ ఉండాలా..? మీడియాపై మహ్మద్ కైఫ్ ఆగ్రహం

భారతదేశంలో టీమిండియా టెస్టు క్రికెటర్ల ఎంపికలో కుల రిజర్వేషన్ లేదని.. అదే ఆఫ్రికా విషయానికి వస్తే అక్కడ క్రీడల్లో కూడా రిజర్వేషన్ ఉంటుందని ఇటీవలే ఓ వెబ్ సైట్ వెల్లడించింది. టీమిండియా టెస్టు స్టేటస్ పొందాక ఇప్పటివరకు ఎంపికైన 290 ఆటగాళ్లలో కేవలం నలుగురు మాత్రమే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని ఆ పత్రిక తెలిపింది. అయితే ఈ కథనం రాసిన వెబ్ సైట్ పై క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "మీడియా రంగంలో ఎంతమంది ప్రైమ్ టైమ్ జర్నలిస్టులు ఎస్సీ. ఎస్టీ కులానికి చెందినవారు ఉన్నారో మీరు చెప్పగలరా? అలాగే మీ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఎడిటర్స్‌లో ఎంతమంది కుల ప్రాతిపదికిన ఎంపిక చేయబడ్డారో చెప్పగలరా?

భారతదేశంలో క్రీడా రంగం ఒక్కటే కుల, మతాలకతీతంగా కట్టుబాట్లను దాటుకొని వెళ్లి.. అసలైన టాలెంట్‌కు న్యాయం చేస్తోంది. ఈ రోజు కొందరు జర్నలిస్టులు ఇలాంటి విషయాలను సాకుగా చూపి విద్వేషాలను రెచ్చగొట్టడం శోచనీయం" అని కైఫ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో మహారాష్ట్రకి చెందిన రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామదాస్ అత్వాలే కూడా ఇలాంటి అంశంపైనే తన అభిప్రాయాలు పంచుకున్నారు.

రామదాస్ అత్వాలే మాట్లాడుతూ, టీమిండియాలో ఎగువ కులస్థుల ఇంటిపేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆయన అన్నారు. "భారతదేశంలో నిమ్నజాతుల వారిలో కూడా అమోఘమైన క్రీడాకారులు ఉన్నారు. కానీ వారికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల పైకి రాలేకపోతున్నారు. జూనియర్ స్థాయిలోనే వారి కెరీర్ ఆగిపోతుంది. ఇక టీమిండియాకి వారు ఎలా ఆడగలరు" అని ఆయన తెలిపారు. అలాగే గతంలో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. టీమిండియాలో ముస్లిం ఆటగాళ్లు లేకపోవడానికి కారణమేంటని ఆయన అడిగారు. అయితే భట్ ప్రశ్నకి అప్పట్లో హర్భజన్ సింగ్ ఘాటుగానే జవాబిచ్చారు. టీమిండియాలో ఆడేవారందరూ తమను తాము భారతీయులుగానే తొలుత భావిస్తారని.. ఇక్కడ మతాల ప్రస్తావన ఉండదని తెలిపారు.

Trending News