ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడు. ఆట నుంచి రిటైరయ్యాక కూడా మ్యాచ్‌లను ఫాలో అవుతూ తన అభిప్రాయాలను సైతం నిర్భయంగా వెల్లడిస్తుంటాడు. అయితే అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు సంబంధించి ఓ సీక్రెట్‌ను తాజాగా వెల్లడించాడు. పాటింగ్‌ను సరదాగా పంటర్ అని జట్టు ఆటపట్టిస్తుంటుంది. అంతర్జాతీయంగా సైతం పాంటింగ్ నిక్ నేమ్ పంటర్ అని చాలా మందికి తెలుసు.
సహచర ఆటగాడు, స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తనకు పంటర్ అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు. ట్విట్టర్లో సరదాగా అభిమానులతో చిట్ చేసిన మాజీ క్రికెటర్.. తనకు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారన్న సీక్రెట్ వెల్లడించాడు. 1990 దశకంలో క్రికెట్ అకాడమీలో నెలకు 40 డాలర్ల స్టయిఫండ్ వచ్చేదన్నాడు. ఆ డబ్బు అందగానే ట్యాబ్‌కు వెళ్లి కుక్కలపై పందెలు కాసేవాడినని తెలిపాడు. అందుకే షేన్ వార్న్ తనకు పంటర్ అని నిక్ నేమ్ పెట్టాడని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
కాగా, ఆసీస్ దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్‌గా రికీ పాంటింగ్ క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. రెండు పర్యాయాలు (2003, 2007) ఆసీస్‌కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ రికీ పాంటింగ్. అతడి కెప్టెన్సీలో ఆసీస్ జట్టు దాదాపు ఓ దశకం పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. రిషబ్ పంత్ త్వరలోనే జట్టులోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.