హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 351, 448 సెక్షన్ల క్రింద ఈ కేసులను నమోదు చేశారు. భారత్-విండీస్‌ల మధ్య రెండో టెస్టు తొలి రోజు మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో.. ఓ కోహ్లీ అభిమాని అనుకోని సాహసం చేశాడు. సెక్యూరిటీ కళ్లు కప్పి ఎలాగోలా మైదానంలోకి చొరబడి.. ఆ తర్వాత పరుగెత్తుకుంటూ కోహ్లీ వైపు వెళ్లాడు. కోహ్లీని గాఢంగా హత్తుకొని.. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు.
అయితే కోహ్లీ అతనికి దూరంగా జరగడానికి ప్రయత్నించాడు. కానీ ఇంతలోనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి.. ఆ అభిమానిని బయటకు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేసి.. ఆ అభిమాని పేరు మహ్మద్ ఖాన్ అని తెలిపారు. అలాంటి పనులు చేయడం చట్ట విరుద్ధం అని.. అందుకే కేసులు నమోదు చేశామని తెలిపారు. మహ్మద్ ఖాన్ కడప జిల్లా వాసి. ఈ మధ్య కాలంలో కోహ్లీకి అభిమానుల బెడద ఎక్కువైంది. కోహ్లీ ఎక్కడ కనిపించినా సెల్ఫీలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఇటీవలే ఓ బాలుడు ఎయిర్ పోర్టులో కోహ్లీ, అనుష్క జంటను కలిసి ఫోటో ఫ్రేమ్ బహుమతిగా ఇవ్వాలని ప్రయత్నించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలాగే రాజ్ కోట్ టెస్టు జరుగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా కోహ్లీ వద్దకు దూసుకువచ్చి సెల్ఫీ కోరారు.