ఎడ్జ్‌బాస్టన్: ఇండియా vs ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు జరగనున్న కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్‌పైనే క్రికెట్ ప్రియుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి టీమిండియా టాప్ 4 జట్లలో స్థానానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్ గెలిచి సెమీ-ఫైనల్స్‌లో బెర్త్ ఖాయం చేసుకోవాలని ఇండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఇంగ్లండ్ జట్టుకు మాత్రం ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఇండియాతో మ్యాచ్ గెలిచి, ఆ తర్వాత న్యూజీలాండ్‌తో గెలిస్తేనే ఆ జట్టుకి సెమీస్‌లో చోటు దక్కుతుంది. లేదంటే ఇంగ్లండ్‌కి నిష్క్రమణ తప్పదు. దీంతో ఆతిథ్య జట్టు సైతం ఈ మ్యాచ్‌ని ఎలాగైనా గెలవాలని అంతే పట్టుదలతో ఉంది.
ఇదిలావుంటే, వరల్డ్ కప్ టోర్నమెంట్ కన్నా ముందు నుంచే ఈ రెండు జట్లను క్రికెట్ ప్రియులు ఫేవరైట్స్గానే భావిస్తుండటం కూడా ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తిని పెంచింది.