ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు గెలుపులో అతడే కీలకం !

ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి ఓటమిపాలైంది.

Last Updated : Apr 15, 2018, 08:43 AM IST
ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు గెలుపులో అతడే కీలకం !

ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో, రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ టీమ్ శనివారం సొంతగడ్డ వాంఖడే స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయంపాలై ఓటమిలో హ్యాట్రిక్ కొట్టింది. టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టేన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌‌కి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు.. చెలరేగి ఆడి 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్స్ సూర్యకుమార్ యాదవ్ 53 పరుగులు (32 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్), ఎవిన్ లెవిస్ 48 పరుగులు ( 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ 44 పరుగులు ( 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ముంబై ఇండియన్స్ జట్టు అలవోకగానే 194 పరుగులు చేసింది. 

అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేద‌న‌తో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సైతం ధాటిగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికే టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఓటమిలో హ్యాట్రిక్ కొడితే, ఈ గెలుపుతో ఈ సీజన్‌లోనే మొట్ట మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది గౌతం గంభీర్ సేన. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన జాసన్ రాయ్ 91 పరుగులు ( 53 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. జాసన్ రాయ్ వీరబాదుడు ఢిల్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. రిషబ్ పంత్ సాధించిన 47 పరుగులు ( 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం ఢిల్లీ గెలుపులో కీలకం అయ్యాయి. మొత్తానికి ఐపీఎల్ 2018 సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు గెలుపు బోణీ కొట్టింది.

 

Trending News