PVR Cuts Snacks Prices After a Journalist's tweet Goes Viral on Popcorn Price: కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిన సమయంలో ఎదురైన లాక్డౌన్, కంటైన్మెంట్ ఆంక్షలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దశ దిశనే మార్చేసింది. అమేజాన్, జీఫై, డిస్నీ హాట్‌స్టార్ లాంటి ఓటిటి యాప్స్ కరోనా కంటే ముందు నుంచే ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ.. అవి ఎక్కువ మందికి రీచ్ అయింది మాత్రం కరోనావైరస్ సమయంలోనే. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో పాటు లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత సైతం అనేక ఆంక్షలు విధించడం వంటివి జనం థియేటర్లకు వెళ్లకుండా చేశాయి.
లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన జనం వినోదం కోసం ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ని ఆశ్రయించారు. దీంతో కాలంతో పాటే తెలియకుండానే ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌కి భారీగా గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా ఇంకెన్నో ఎంటర్ టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు, ఇంటర్వ్యూలు, స్పోర్ట్స్, చివరకు న్యూస్ కూడా ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తోంది.
ఇక్కడ సీన్ కట్ చేస్తే.. లాక్డౌన్ ఎత్తేయడం, కరోనావైరస్ దాదాపు ఇక లేదనుకున్న తరువాత ఆంక్షలు కూడా పూర్తిగా ఎత్తేయడం జరిగిపోయింది. ప్రస్తుతం అంతా నార్మల్ గా నే ఉంది. అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ థియేటర్‌కి వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం థియేటర్లలో.. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్సులలో సినిమాలు చూడటం అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.
ఓవైపు థియేటర్లలో సినిమాల టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన చెందుతుండగానే.. మరోవైపు ఇంటర్వెల్ క్యాంటీన్ వైపు వెళ్తే ఇక జేబుకు పెద్ద చిల్లే పడుతోంది. సాధారణంగా ఆర్టీసీ బస్టాండుల్లో రూ. 20 లభించే పాప్ కార్న్ అక్కడ రూ. 180 నుంచి రూ 300 లేదా రూ. 400 వరకు కూడా విక్రయిస్తున్నారు. కూల్ డ్రింక్స్, డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్.. ఇలా ఒకటేమిటి.. ఏది టచ్ చేసినా హార్ట్ ఎటాక్ వచ్చే రేట్లే ఉంటున్నాయి.
ఇదే విషయమై ఇటీవల ట్విట్టర్లో ఒక పోస్ట్ వైరల్ అయింది. నోయిడాలోని PVR థియేటర్లో పాప్‌కార్న్ కొంటే రూ. 820 హుష్‌కాకీ అయ్యాయని.. కానీ అదే ధరకే అమెజాన్ సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు రీచార్జ్ చేసుకోవచ్చు అంటూ ఒక జర్నలిస్ట్ చేసిన ట్వీట్ అది. తను తీసుకున్న పాప్‌కార్న్ బిల్లును కూడా తన ట్వీట్లో పోస్ట్ చేశాడు. థియేటర్లో ఒక్కరోజు సినిమాకు పాప్ కార్న్ కొనేకంటే.. అదే ధరకు అమేజాన్ రీచార్జ్ చేసుకుని ఇంటిల్లిపాది ఏడాదంతా ఎప్పుడు అంటే అప్పుడు సినిమా చూడొచ్చన్నమాట అనే విషయాన్ని జనానికి అర్థం అయ్యేలా చాలా ఈజీగా చెప్పేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవడంతో తేరుకున్న పీవీఆర్ యాజమాన్యం.. చివరకు రేట్లను తగ్గిస్తూ దిగిరాక తప్పలేదు.
We at PVR believe that every opinion matters and it must be respected. We have this update for you and for every moviegoer in India #PVRHeardYou https://t.co/rrBL3xFUJs pic.twitter.com/PsOvxxqAaj
— P V R C i n e m a s (@_PVRCinemas) July 12, 2023
తమ థియేటర్లలోని క్యాంటీన్లలో స్నాక్స్ ధరలను తగ్గిస్తున్నట్లు తాజాగా పీవీఆర్ ప్రకటించింది. అంతేకాకుండా వీకెండ్స్‌లో అన్లిమిటెడ్ పాప్‌కార్న్, అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్ రీఫిల్ వంటి ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. అంతేకాకుండా, సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య బర్గర్లు, సమోసాలు, శాండ్విచ్లు, పెప్సీ వంటి స్నాక్స్‌ని రూ. 99 మాత్రమే అందించనున్నట్టు స్పష్టంచేసింది. కస్టమర్ చేసిన ట్వీట్‌కి ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీవీఆర్ స్పష్టంచేసింది.