Pawan Kalyan Meets Bhupendra Yadav: ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బుధవారం భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు.
పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాలు తీసుకువచ్చారు. ‘‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది.
ఈ ప్రతిపాదననను పరిశీలించలరు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది.
ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్‌గా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలి.
దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్‌గా కొనసాగుతుంది’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.