వైద్యంగా మారనున్న ఇళయరాజా సంగీతం

రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉందంటారు కొంతమంది.

Last Updated : Aug 5, 2018, 01:47 PM IST
వైద్యంగా మారనున్న ఇళయరాజా సంగీతం

రాయినైనా కరిగించగల శక్తి సంగీతానికి ఉందంటారు కొంతమంది. ఎంతటి దుఃఖంలో ఉన్నా మనసుకి స్వరాలు తాకితే ఆ ఆనందమే వేరు. మనం ఒత్తిళ్లకు, డిప్రెషన్‌లకు గురైనప్పుడు సంగీతాన్ని వింటుంటాం. మానసిక రుగ్మతల నుండి బయటపడటానికి వాడే సంగీతాన్ని.. ఇప్పుడు వైద్య రంగంలోనూ పరిచయం చేస్తున్నారు.

ఇళయరాజా సంగీతాన్ని వైద్యానికి వినియోగించడంపై సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ వైద్యులు కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఇళయరాజా రూపొందించిన సంగీత ఆల్బమ్‌లపై పరిశోధనలు చేస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో కూడా ఇందుకోసం కొన్ని ప్రత్యేక ట్యూన్లు కంపోజ్ చేస్తున్నారు. సంగీతంలో మనసులు ప్రశాంతంగా ఉంచి.. పాజిటివ్ ఆలోచనలు కల్గించి రోగాన్ని త్వరగా నయం చేసే మ్యూజికల్ థెరపీలో ఈ బాణీలను వాడనున్నారు.

2008లో కూడా ఇళయారాజా సంగీతానికి ఇటువంటి గౌరవమే దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. 2008 జులైలో జర్మనీలో నివసిస్తున్న ఓ తమిళ జంట పండింటి బిడ్డకు జన్మనిచ్చిందని.. డాక్టర్లు ఆశ్చర్యపోయారని.. మెడికల్ మిరకిల్ అని ఓ ప్రముఖ మ్యాగజైన్ ప్రచురించింది. కొన్ని నెలల క్రితం ఈ తమిళ యువ జంటకు.. తల్లి గర్భంలోని బిడ్డ కదలట్లేదని..కష్టమని చెప్పారు. దాంతో బాధతో ఇంటికి వచ్చి అలవాటుగా ఇళయరాజా సంగీతం వినడం ప్రారంభించారు ఆ జంట. ఆశ్చర్యంగా తల్లి గర్భంలోని బిడ్డ కదలడం ప్రారంభించింది. అలా వాళ్లు అనేకసార్లు సంగీతాన్ని రిపీట్ చేసి చూస్తే.. నిజంగానే గర్భంలోని బిడ్డ కదిలింది. కొద్ది నెలల తర్వాత ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారని మ్యాగజైన్ ప్రచురించింది. ఆ తర్వాత తమిళ యువజంట ఇండియాకి వచ్చి మాస్ట్రో ఇళయరాజాకు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది.

వెయ్యికిపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఇళయరాజాది. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్, నాలుగు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులను అందుకున్న ఇళయరాజా టాలెంట్‌కు ఇది మరో గుర్తింపు.

 

Trending News