K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.. 'నేను చెప్పింది తప్పయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'

K Kavitha Hot Comments In BC Massive Dharna: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. తాను చెప్పినవి వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 3, 2025, 05:06 PM IST
K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.. 'నేను చెప్పింది తప్పయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'

Kalvakuntla Kavitha: వెనుకబడిన వర్గాలకు నాటి ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ఎన్టీఆర్‌ న్యాయం చేశారని.. కానీ రేవంత్‌ రెడ్డి మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారని గుర్తుచేశారు. జన గణనలో భాగంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Also Read: KT Rama Rao: 'బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. మీకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా'

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని.. కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. వెంటనే బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: K Kavitha: 'రైతులను కేసీఆర్‌ కడుపులో పెట్టుకుంటే.. రేవంత్‌ రెడ్డి సున్నంపెట్టే ప్రయత్నం'

'తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే.. మరో కమిషన్ నివేదిక ఇస్తుంది. ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా?' అని కవిత సందేహం వ్యక్తం చేశారు. 'బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రశ్నిస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా! ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారు' అని వివరించారు.

ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. '42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే! లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలి' అని కవిత సవాల్‌ చేశారు. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని చెప్పారు. 'మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన ఉద్యమాలతో జంగు పట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయి' అని కవిత తెలిపారు.

'బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది . నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు' అని కవిత గుర్తుచేశారు.

'రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా' అని కవిత సంచలన ప్రకటన చేశారు. 'కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు' అని కవిత తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News