ప్రముఖ పాత్రికేయురాలు, సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన అమోల్ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, కన్నడ నటుడు గిరీష్ కర్నాడ్ వారి హిట్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. దేవనగిరి లిపిలో రాసి ఉన్న వివరాల్లో గిరీష్ కర్నాడ్ పేరు తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో గౌరీ లంకేష్ పేరు ఉన్నట్టుగా ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు తెలిపారు. హిందూత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తోన్న 37 మంది గౌరీ లంకేష్ హంతకుల హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు సిట్ బృందం తాజాగా స్పష్టంచేసింది. నెల రోజుల క్రితమే ఈ విషయం వెలుగుచూడటంతో గిరీష్ కర్నాడ్‌కు భద్రత కట్టుదిట్టం చేసినట్టు సిట్ పేర్కొంది.
రాజకీయ నాయకురాలు, కన్నడ సాహితీవేత్త బీటీ లలిత, నిడుమామిడి మఠానికి చెందిన వీరభద్ర చన్నమల్ల స్వామి, హేతువాది సీఎస్ ద్వారకానాథ్ వంటి ప్రముఖులు సైతం గౌరీ లంకేష్ హంతకుల హిట్ లిస్టులో ఉన్నారు. హిట్ లిస్టులో తన పేరు ఉండటంపై గిరీష్ కర్నాడ్ స్పందిస్తూ... ఇటువంటి అంశాలపై ఆసక్తి ప్రదర్శించడం తనకు అంతగా ఇష్టం లేదని అన్నారు.
హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూ, తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారని ఆరోపిస్తూ గౌరీ లంకేశ్‌ను గత ఏడాది సెప్టెంబర్ 5న తన ఇంటి ముందే కాల్చిచంపడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.