క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియా క్రికెట్ కప్‌లో తలపడనున్నాయి. భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా పోటీపడుతున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 15 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌తో పాటు ఓ క్వాలిఫయర్ జట్టు.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 15న జరిగే టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఆడనుంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో క్వాలిఫయర్ జట్టుగా బరిలోకి దిగేందుకు యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హాంకాంగ్ పోటీపడుతున్నాయి. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 6 వరకు క్వాలిఫయర్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో ఎవరు గెలుస్తారో వారు గ్రూప్-ఏలోని జట్లతో తలపడతారు.
చెప్పాలంటే మొదట ఆసియా కప్ టోర్నీ భారత్‌లో జరగాలి. కానీ పాకిస్థాన్‌తో ఉన్న విభేదాల కారణంగా యూఏఈకి వేదికను మార్చారు. మ్యాచులన్నీ అబుదాబీ, దుబాయ్ స్టేడియాలలో జరగనున్నాయి. ఈ టోర్నీ సంప్రదాయ ఓడీఐ ఫార్మాట్లో ఉంటాయి. 1984లో ఆసియా కప్ టోర్నీ ప్రారంభమయ్యింది. సాధారణంగా ప్రతి రెండేళ్ల కొకసారి జరిగే ఈ టోర్నీ చివరగా 2016లో జరిగింది. భారత్ 2016 ఆసియా కప్ విజేత కాగా, రన్నరప్‌గా బంగ్లాదేశ్ నిలిచింది. ఇప్పటివరకు భారత్ ఆసియా కప్ విజేతగా 6సార్లు, రన్నరప్‌గా 3సార్లు నిలిచింది. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. 2సార్లు విజేతగా, 2సార్లు రన్నరప్‌గా నిలిచింది. కాగా.. 1990/91లో భారత్‌లో తొలిసారి ఆసియా కప్ టోర్నీ నిర్వహించారు.