కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ రోజు సీడబ్ల్యుసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, గులాం నబీ ఆజాద్ మొదలైన వారందరూ పాల్గొన్నారు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు తీర్మానించారు. తమ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు.. ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు.
పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. సోనియా గాంధీ కూడా ఈ సమావేశంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలను బీజేపీ పార్టీ కబంధ హస్తాల నుండి విముక్తుల్ని చేయడానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. వీలైతే మిగతా ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేయడానికి కూడా తాము సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా పేర్కొంది.
ఇదే సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 12 రాష్ట్రాలలో 150 సీట్లు గెలుస్తుందని తెలిపారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, జీఎస్టీ, నోట్లరద్దు లాంటి నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని.. తాజాగా జీఎస్టీ ధరలు తగ్గించడం వెనుక కూడా ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ ముందుచూపే కనిపిస్తోందని అన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అమలులోకి తీసుకొస్తామని కాంగ్రెస్ తెలిపిందని.. ఇదే న్యాయం బీజేపీ పాలనలో జరగదని తెలిపారు.