IND vs NZ, Ramiz Raja Heap Praise on India Batter Shubman Gill: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో డబుల్ సెంచరీ (208; 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు)తో చెలరేగిన విషయం తెలిసిందే. ఇక రెండో వన్డేలోనూ కీలక రన్స్ (40 నాటౌట్; 53 బంతుల్లో 6 ఫోర్లు) బాదాడు. దాంతో గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ఎప్పుడూ విమర్శలు చేసే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా.. గిల్ ఆట తీరుని మెచ్చుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు గిల్ మినీ వెర్షన్‌లా ఉన్నాడని ఆయన కొనియాడాడు.
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'శుబ్‌మన్ గిల్ మినీ రోహిత్ శర్మలా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అతడి నైపుణ్యం చాలా బాగుంది. అతనికి క్రికెట్ ఆడేందుకు చాలా సమయం ఉంది. తగినంత సామర్థ్యం ఉంది. సమయంతో పాటు దూకుడు కూడా అలవాటు అవుతుంది. గిల్ ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అతను ఇటీవల న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. చాలా బాగా ఆడాడు. గిల్ ఇన్నింగ్స్‌లో అద్భుత షాట్లు ఉన్నాయి' అని అన్నాడు.
'న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బ్యాటింగ్ అద్భుతంగా సాగుతోంది. రోహిత్ శర్మ వంటి అత్యుత్తమ బ్యాటర్ ఉన్నందున భారత్‌కు బ్యాటింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. రోహిత్ చాలా బాగా ఆడతాడు. హుక్ అండ్ పుల్ షాట్లలో అద్భుతమైన స్ట్రైకర్. అందుకే రెండో వన్డేలో 108 పరుగుల లక్ష్య ఛేదన సులువైంది. విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి ఉండనే ఉన్నాడు. భారత జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు' అని రమీజ్ రజా పేర్కొన్నాడు.
భారత బ్యాటింగ్ యూనిట్‌లో కొన్ని సాంకేతిక లోపాలు కూడా ఉన్నాయని రమీజ్ రజా తెలిపాడు. 'భారత బ్యాటర్లు చేయాల్సిన అంశం ఒకటుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్. వారి ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. బ్యాక్ ఫుట్ నుంచి కొట్టడం చాలా సులభం. కానీ బంతి పైకి వచ్చినప్పుడు.. డిఫెన్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే లోపం ఉందనిపిస్తోంది. టెస్టు క్రికెట్, వన్డేల్లో భారత్ పునరుజ్జీవం పొందాలంటే బౌలింగే ఆధారం. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది' అని రజా చెప్పుకొచ్చాడు.
Also Read: Guru Uday 2023: బృహస్పతి ఉదయం.. ఈ రాశుల వారు రెండు చేతులతో డబ్బు సంపాదిస్తారు! ఇంటినిండా మనీ బాగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.