భారతదేశంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు. పర్యటనలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మూన్ జె మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణకొరియా, భారత్‌ల సంస్కృతులు వేరైనా.. శాంతి సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం వంటి విలువల విషయంలో మాత్రం రెండూ దేశాలూ ఒక్కటేనన్నారు. మూన్ జె తన పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పలు అంశాలపై చర్చించనున్నారు. కొద్దిసేపటి క్రితం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెను మర్యాదపూర్వకంగా కలిశారు. మూన్ జె అధ్యక్షుడయ్యాక భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
సోమవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ప్రధాని మోదీ శామ్సంగ్ పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. వీరిద్దరూ ప్రపంచంలోనే అతిపెద్ద శామ్సంగ్ మొబైల్ ఫ్యాక్టరీని నోయిడాలో ప్రారంభించనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ శామ్సంగ్ సంస్థ మొబైల్ ఫోన్లను తయారు చేయనున్నది. ఈ సంస్థ 2020 నాటికి నెలకు 10 మిలియన్ యూనిట్ల ఫోన్లను తయారు చేస్తుందని దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, ఛాంగ్ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.