ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు మాత్రమే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాయి. ప్రస్తుతం ఈ దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.12,500 కోట్ల రూపాయల సహాయాన్ని ఇస్రో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ తొలి దశ పనుల్లో భాగంగానే ఇస్రో సిబ్బంది "క్రూ ఎస్కేప్ సిస్టమ్"ని రూపొందించారు.
అందుకు తగ్గ అదనపు సాంకేతికను సమకూర్చుకొని.. తొలిసారిగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ద్వారా ప్యాడ్ అబార్ట్ ప్రయోగాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే దిశగా తాము వ్యవస్థలకు రూపకల్పన చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు.
ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అదనపు తర్ఫీదునివ్వాలని కూడా ఇస్రో యోచిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఈ పనులు జరుగుతాయి. అలాగే ఇలాంటి వ్యోమగామ యాత్రలకు ఉపయోగపడే జీఎస్ఎల్వీ మార్క్ 3ని గత సంవత్సరమే విజయవంతంగా పరీక్ష చేయడం కూడా జరిగింది. గతంలో ఇలాంటి ప్రయోగాలను నాసా అనేక సార్లు చేసింది.