నడి రోడ్డుపై ల్యాండ్ అయిన విమానం.. షాకైన వాహనదారులు!

నడి రోడ్డుపై ల్యాండ్ అయిన విమానం

Last Updated : Jun 3, 2018, 05:55 PM IST
నడి రోడ్డుపై ల్యాండ్ అయిన విమానం.. షాకైన వాహనదారులు!

విమానాలు ఎయిర్ పోర్టులో రన్‌వే పై ల్యాండ్‌ అవడం సర్వసాధారణం. కానీ అందుకు భిన్నంగా బిజీ రోడ్డుపై ఉన్నట్టుండి ఓ విమానం ల్యాండ్ అయితే చూడటానికి ఆ సీన్ ఎలా ఉంటుంది ? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్‌లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు హంటింగ్టన్ బీచ్‌ రోడ్డులో కనిపించిన ఈ సీన్‌ని అలాగే ఊపిరి బిగపట్టుకుని చూశారు అక్కడున్న ప్రత్యక్షసాక్షులు, ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు. జాన్ వేన్ ఎయిర్ పోర్టు నుంచి గాల్లోకి లేచిన సెస్నా 172 అనే తేలికపాటి విమానం.. ఓ ఐదు మైళ్ల దూరం ప్రయాణించాకా ఉన్నట్టుండి ఇలా నడిరోడ్డుపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. సింగిల్ ఇంజన్ కలిగిన ఈ విమానంలో టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏం చేయాలో అర్థంకాని మహిళా పైలట్ విమానాన్ని ఇలా నడిరోడ్డుపై దించేసింది. అయితే విమానం ల్యాండ్ అయిన తీరు చూసి అవాక్కైన అలెక్స్ పెరాజ్జో అనే స్థానికుడు.. "విమానం కూలిపోకుండా, రోడ్డుపై విద్యుత్ తీగలకు తగలకుండా అంత సురక్షితంగా, జాగ్రత్తగా ఎలా దించారో అర్థం కాలేదు" అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

 

ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో దిగిన విమానాన్ని చూసి షాక్ అవడం రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారుల వంతయ్యింది. అదృష్టవశాత్తుగా ఆ సమయంలో రోడ్డుపై అంతగా రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని ప్రత్యక్షసాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు.

Trending News