PV Narasimha Rao Statue in Australia: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ ఫీల్డ్ హోంబుష్ కమ్యూనిటీ సెంటర్లో శనివారం జరిగిన పీవీ నరసింహా రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, పీవీ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఒక బిలియన్‌కు పైగా జనాభా ఉన్న భారత దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించిన పీవీ నరసింహా రావు విగ్రహాన్ని ఇలా మొదటిసారి విదేశీ గడ్డపై ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు విదేశాల్లో పీవీ నరసింహా రావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గొప్ప కార్యక్రమమని అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల ఓవర్సీస్ కమిటీ కన్వీనర్‌గా విదేశాల్లో ఉత్సవాలు జరిపే అవకాశాన్ని సీఎం కేసీఆర్ తనకు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే సుమారు 50 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించామన్నారు. 1995లో తాను మొదటిసారిగా అస్ట్రేలియాకు వచ్చినప్పుడు స్ట్రాత్ ఫీల్డ్‌లోనే ఉన్నానని.. అదే చోట స్థానిక మేయర్, కౌన్సిల్ అనుమతితో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.
పీవీ నర్సింహా రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్ మాట్లాడుతూ.. అన్ని దేశాల ప్రజలను కలుపుకొనిపోయే సోదర భావం ఉన్న ఆస్ట్రేలియాలో పీవీ నరసింహారావు లాంటి భారత మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా పీవీ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీ దేవి మాట్లాడుతూ.. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పీవీ రాజకీయ జీవితాన్ని, ఆయన్ను పదవులు ఎలా వరించాయి, ప్రధానిగా పరిపాలనపై పీవీ వేసిన ముద్రను వాణి దేవి వివరించారు. భారత దేశ ప్రధానిగా పీవీ చేపట్టిన గొప్పగొప్ప ఆర్థిక సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు, సంస్కరణలను ఎమ్మెల్సీ వాణీ దేవి సభలో వివరించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా, ఘనంగా నిర్వహించడానికి తీసుకున్న చొరవను కొనియాడారు. సిడ్నీలో విగ్రహావిష్కరణకు సహయసహకారాలు అందించిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, అందుకు కృషిచేసిన ఎంపీ కే.కేశవ రావు ఆధ్వర్యంలోని కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి వ్యక్తిని తానే అని తెలిపారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అది కూడా తమ కౌన్సిల్ పరిధిలో పీవీ విగ్రహాన్ని నెలకొల్పడం చాలా గర్వంగా ఉందని అన్నారు. పీవీ విగ్రహం ఏర్పాటుకు సహకారం అందించిన ప్రతీ ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్లు రాజ్ దత్తా, శ్రీని పిల్లమర్రి, లివింగ్ స్టర్ చెట్టిపల్లి, పీవీ బంధువు డాక్టర్ హేమచంద్ర, ఇతర కుటుంబ సభ్యులు, డాక్టర్ భారతిరెడ్డి, హర్ మోహన్ వాలియా, పీవీఎన్ఆర్ లోకల్ కోర్ కమిటీ సభ్యులు కేరీరెడ్డి, అరవింద్, రాజేష్ రాపోలు, కిషోర్ బెండె, వెంకటరమణ, ఉపేందర్ గాదెతోపాటు స్థానిక ఇండియన్, తెలుగు, తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
విదేశీ గడ్డపై మొదటి సారిగా భారత మాజీ ప్రధాని విగ్రహం
విదేశాల్లో ఏర్పాటైన భారతీయుల విగ్రహాల విషయానికి వస్తే.. జాతిపిత మహాత్మా గాంధీ తరువాత ఆవిష్కరించిన రెండో భారతీయుడి విగ్రహం మన తెలుగు బిడ్డ పీవీ నరసింహా రావుదే అని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే విదేశీ గడ్డపై ఆవిష్కరించిన భారత ప్రధాని తొలి విగ్రహం కూడా పీవీ నరసింహా రావుదే అవుతుందన్నారు. తెలుగు కళాకారుడైన ప్రసాద్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్లలో ఒకరైన సంధ్యారెడ్డిని విగ్రహం ఏర్పాటు కోసం సంప్రదించగా.. ఆమె అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి విగ్రహం ఏర్పాటు కోసం కృషిచేసినట్టు మహేష్ బిగాల తెలిపారు.
Also Read : Indian Student stabbed: ఆస్ట్రేలియాలో దారుణ ఘటన.. డబ్బు కోసం ఇండియన్ స్టూడెంట్ పై కత్తిపోట్లు
Also Read : Canada New Work Hour Rules: వారానికి 20 గంటల పని నిబంధన తొలగింపు, భారతీయ విద్యార్ధులకు ఎలా ప్రయోజనకరం
Also Read : California Kidnap: కాలిఫోర్నియాలో కలకలం, 8 ఏళ్ల చిన్నారి సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి