కర్ణాటక రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం వివాదాస్పదమైన క్రమంలో.. కాంగ్రెస్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయగా నిన్నే ఈ విషయమై న్యాయస్థానం విచారణ చేసింది. గవర్నర్ నిర్ణయం పట్ల ఒకింత ఆశ్చర్యం కనబరుస్తూనే.. ఇరు పార్టీలు సంఖ్యా బలం నిరూపించుకోవడానికి శనివారం సాయంత్రం 4 గంటలకు ముహుర్తం ఖరారు చేసింది.
అయితే ఈ బలపరీక్షలో ప్రొటెం స్పీకర్ పాత్ర ప్రధానమైందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పదవిని యడ్యూరప్పకు సన్నిహితుడైన కె.జి.బోపయ్యకు కట్టబెట్టడం కూడా సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. కాగా ఈ విశ్వాస పరీక్షలో గెలుస్తామని ఇరు పార్టీల నేతలూ చెబుతున్నారు.
నిన్నటి వరకూ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం హైదరాబాదుకి మకాం మార్చిన కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఈ రోజు మళ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు బెంగళూరుకి ప్రయాణమయ్యారు. కాగా ప్రొటెం స్పీకరు పదవి మీద మళ్లీ వివాదం తలెత్తడంతో ఆ అంశంపై కూడా ఈ రోజు ఉదయం విచారణ కోర్టులో జరగనుంది.
కాగా.. ఈ విశ్వాస పరీక్ష అంశం తెరమీదికి వచ్చాక కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హొసపేటె శాసనసభ్యుడు ఆనంద్సింగ్ను అక్రమంగా ప్రతిపక్షాలు నిర్భందించాయని ఆయన తెలిపారు. అలాగే గాలి జనార్థనరెడ్డి తమ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తు్న్నారని చెబుతూ.. కాంగ్రెస్ నేతలు కూడా పలు ఆడియా రికార్డులను బహిర్గతం చేశారు.