బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ పై అత్యాచార ఆరోపణలు నమోదైన ఉన్నావ్ రేప్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. సీబీఐ దర్యాప్తులో ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు నిజమేనని తేల్చడంతో బాధితురాలు, తనపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయడం గమనార్హం. తన ఇంటికి పిలిచి మరీ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని.. అదే సమయంలో అతను బయట మరో వ్యక్తిని కాపలా పెట్టాడని బాధితురాలు తెలిపింది.
కోర్టుకి వచ్చి కూడా ఈ విషయం చెబుతానని.. అయితే తన కుటుంబానికి కోర్టు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. తొలుత ఈ కేసులో ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆ తర్వాత బాధితురాలు ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో...ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది.
ఆ తర్వాత ఛార్జిషీటు దాఖలు చేసి.. కేసును సీబీఐకి అప్పగించారు. అంతకు క్రితమే బాధితురాలి తండ్రి అనుమానాస్పదమైన రీతిలో మరణించడం కూడా కేసు విషయంలో అనేక కొత్తకోణాలను బహిర్గతం చేసింది. గతవారం బాధితురాలి అభ్యర్థన మేరకు, ఆమెపై వస్తున్న ఒత్తిడి మేరకు అలహాబాద్ కోర్టు ఎమ్మెల్యేని ఉన్నావ్ జైలు నుండి సీతాపూర్ జైలుకి తరలించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సెంగార్, నాలుగు సార్లు ఆ పదవికి ఎన్నికవ్వడం గమనార్హం.