ప్రజారాజ్యం పేరుతో పార్టీని పెట్టి ప్రజాసేవ చేయాలనే తలంపుతో మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికలతో రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగమైన యువరాజ్యంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణాలేమిటో మనకు తెలిసిన విషయాలే. కాంగ్రెస్ అధికారంలోకి రాగా..ప్రజారాజ్యం కేవలం 18 సీట్లతోనే సరిపెట్టుకుంది.
అయితే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్గస్తులయ్యాక.. జగన్ మరో పార్టీని స్థాపించడంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం చూస్తూ చిరంజీవిని ఆహ్వానించగా.. ఆయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో మిళితం చేయడంతో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనేకమంది చిరంజీవి చర్యను తప్పుపట్టినా.. అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవ్వడమే కాకుండా.. ఆ తర్వాత కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇక రాష్ట్ర మంత్రిత్వ శాఖలో గంటా శ్రీనివాసరావు లాంటి వారికి మంత్రి పదవులూ దక్కాయి..
అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వద్దకు ఇదే అంశం చర్చకు వస్తే ఆయన తన మనసులోని మాటను బయట పెట్టారు. "నాయకుడు ఎప్పుడూ ఒక సిద్ధాంతాన్ని నమ్మే ముందుకు వెళ్లాలని.. ఎన్ని అవాంతరాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతాలను వదలకూడదని.. తనకు తోడున్నవారితో ముందుకు వెళ్లాలని" ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకొన్నారు అని అర్థం వచ్చే ప్రశ్నకు ఆయన ఆ విధమైన సమాధానం ఇచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల గురించి పవన్ వద్ద ప్రస్తావించగా.. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారని జనసేనాని తెలిపారు. మరి చిరంజీవి భవిష్యత్తులో జనసేన వైపు వస్తే.. అన్న ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం కాలమే చెప్పాలి.