KCR U TURN: తెలంగాణ ముఖ్యమంత్రి రూట్ మార్చారు. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగినా స్పందించలేదు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరుద్యోగ యువకులు చేసిన ఆందోళన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి దారి తీసింది. రైళ్లును తగలబెట్టారు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయినా కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు. ప్రగతి భవన్ లేదా ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్.. జాతీయ రాజకీయాలకు సంబంధించి వివిధ వర్గాల నేతలతో చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్ పలుసార్లు ప్రగతి భవన్ వచ్చి వెళ్లారు. ఏపీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు వచ్చి కేసీఆర్ ను కలిశారు. అయితే తాజాగా కేసీఆర్ తన రూట్ మార్చారు. రాష్ట్ర సమస్యలపై ఫోకస్ చేశారు.మంగళవారం ప్రగతి భవన్ లో రెండు కీలక అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు కేసీఆర్
తెలంగాణలో ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిన ధరణి పోర్టల్ పై రివ్యూ చేశారు కేసీఆర్. భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఈనెల 15 నుంచి ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఇందుకోసం వంద బృందాలను ఏర్పాటు చేయాలని రెవిన్యూ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు చేశారు. రెవిన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సును ఈ నెల 11న ప్రగతి భవన్ లో నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకులాలపైనా ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ రంగాల్లోను ఉద్యోగ శిక్షణ ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.
సీఎం కేసీఆర్ దాదాపు రెండు నెలలుగా ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. మే18న చివరి సారిగా ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. పల్లెప్రగతి, పట్టణప్రగతితో పాటు ధాన్యంసేకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణం, వైకుంఠధామాలు, ప్రకృతివనాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఆ తర్వాత అసలు రాష్ట్ర సమస్యలపై ఎక్కడా స్పందించలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్ర అంశాలపై ఫోకస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్న జాతీయ రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్ర సమస్యలపై ఫోకస్ చేయడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. పీకే టీమ్ లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జనం నాడి తెలుసుకున్నాయి. పీకే టీమ్ సర్వే నివేదిక కేసీఆర్ కు చేరిందని తెలుస్తోంది. పీకే సర్వేలో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తేలడం వల్లే రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
పీకే నివేదికలో టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేకత భారీగా ఉందని తేలిందట. ధరణి పోర్టల్ లో లక్షలాది మంది భూముల లెక్కలు లేవనే విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి. ధరణి బాధితులు దాదాపు రెండేళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తహశీల్దార్, ఆర్జీవో, జాయింట్ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. దీంతో ధరణి బాధితులంతా కేసీఆర్ సర్కార్ పై మండిపడుతున్నారు. ఇది తమ కొంప ముంచేలా ఉందని ఎమ్మెల్యేలు కేసీఆర్ కు మొరపెట్టుకున్నారని సమాచారం. అందుకే ధరణిపై కేసీఆర్ సమీక్ష చేసిన వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారని అంటున్నారు. నిరుద్యోగ యువత టీఆర్ఎస్ పాలనపై ఆగ్రహంగా ఉందని పీకే సర్వేలో వచ్చిందట. అందుకే యువతను కూల్ చేసేలా జిల్లాకు నాలుగు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
పీకే సర్వేలో వచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రజల్లో ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉన్న అంశాలపై ఇక కేసీఆర్ ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విపక్షాల దూకుడుతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. నిర్మాణం పూరైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్దిదారులకు పంపిణి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: AP Schools: నాడు- నేడు అంటే ఇదేనా.. ఏపీలో 8 వేల ప్రభుత్వ స్కూళ్లు మాయం!
Read also: LPG Cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook