Agnipath Scheme Details: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసన హింసాత్మకమైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో పలువురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అసలు అగ్నిపథ్ అంటే ఏంటి, ఎందుకు నిరసననలు చెలరేగుతున్నాయో కారణాలు తెలుసుకుందాం..
అగ్నిపథ్ అంటే ఏంటి
అగ్నిపథ్ అనేది కేంద్ర రక్షణశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఓ పథకం. జూన్ 14వ తేదీన ఈ పధకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ ప్రకారం భారతదేశ త్రివిధ దళాల్లో నియమకాలు జరగనున్నాయి. ఈ పథకంలో భాగంగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నావికాదళాల్లో ఎంపికైనవారిని అగ్నివీర్స్‌గా పరిగణిస్తారు.
అగ్నిపథ్ అర్హత ఏంటి
17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకూ వయస్సు ఉన్నవాళ్లు అగ్నిపథ్ పథకానికి అర్హులు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ వ్యవస్థ ఇది. తొలి ఏడాది వేతనం ఏడాదికి 4.76 లక్షల రూపాయలు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ నావికా దళాల్లో నియామకాలు లేకపోవడంతో ఈసారికి అగ్నిపథ్ వయస్సు 23 ఏళ్ల వరకూ ఉండవచ్చని కేంద్ర రక్షణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఆందోళన చెలరేగింది. కొన్ని ప్రాంతాల్లో ఆందోళన హింసాత్మకమైంది. రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడం, రైళ్లు తగలబెట్టడం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఘండ్ రాష్ట్రాల్లో హింస చెలరేగింది.
అగ్నిపథ్‌పై ఆందోళన ఎందుకు, ఎందుకీ నిరసనలు
కోవిడ్ 19 కారణంగా నిలిచిపోయిన ఆర్మీ నియామకాల్ని రెండేళ్ల తరువాత చేపట్టే సందర్బంలో తీసుకొచ్చిన కొత్త బిల్లు అభ్యర్ధుల ఆగ్రహానికి కారణమైంది. వాస్తవానికి ఆర్మీ నియామకాలపై లక్షలాదిమంది అభ్యర్ధులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. కోవిడ్ పరిస్థితులు నియంత్రణలో ఉండటంతో ఈసారి నియామకాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే లక్షలాదిమంది అభ్యర్ధుల ఆశలకు విభిన్నంగా కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద అగ్నిపథ్ పథకం ఆగ్రహానికి కారణమైంది. అదే సమయంలో ఈ పథకంపై విస్తరించిన కొన్ని పుకార్లు కూడా ఈ అల్లర్లను మరింతగా పెంచాయి.
1. అగ్నిపథ్ నియామకాల్ని కేంద్రం టూర్ ఆఫ్ డ్యూటీలో భాగంగా చేపట్టాలని నిర్ణయించింది. అంటే ఓ నిర్ణీత కాలానికి త్రివిధ దళాల్లో అభ్యర్ధుల్ని తీసుకుంటారు. ఆ నిర్ణీత కాల వ్యవధి కేవలం నాలుగేళ్లుంటుంది. అంటే నాలుగేళ్ల తరువాత తిరిగి నిరుద్యోగులుగా మారుతారు. అదే షార్ట్ సర్వీస్ కమీషన్ ప్రకారం ఇప్పటివరకూ చేపట్టిన నియామకాలు 10-12 ఏళ్ల కోసముంటాయి. అదే అగ్నిపథ్ పథకంలో 25 శాతం మందికే ఆ అవకాశముంటుంది. మిగిలినవారంతా తిరిగి వచ్చేయాల్సిందే. అంటే నాలుగేళ్ల తరువాత ఏం చేయాలనేది అభ్యర్ధుల ప్రశ్న.
2. నాలుగేళ్ల కాలం తరువాత డిగ్రీ, ఇతర విద్యార్హతలు లేని కారణంగా చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ కావల్సిందేనని నిరసనకారులు చెబుతున్నారు. అంతేకాకుండా పెన్షన్, గ్రాట్యుటీ కూడా ఉండదని మరో వాదన విన్పిస్తోంది. నాలుగేళ్ల కోసం చేపట్టే నియామకాల సందర్భంగా ఇచ్చే శిక్షణను ఆ తరువాత ఏం చేసుకోవాలని..వృధా పోతుందనేది అభ్యర్ధుల ఆవేదన. దేశం కోసం పనిచేయాలని ఆశించి..త్రివిధ దళాల్లో చేరి ..నాలుగేళ్లకు తిరిగొచ్చి..ప్రైవేట్ సెక్యురిటీ పరిశ్రమలో చేరాలా అని ప్రశ్నిస్తున్నారు.
3. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా త్రివిధ దళాల్లో నియామకాలు చేపట్టనందున రెండేళ్ల రిలాక్సేషన్ ఇవ్వాలనేది మరో డిమాండ్. ప్రస్తుతం ఈ డిమాండ్ నెరవేరినట్టు కన్పిస్తోంది. వయస్సును 23 ఏళ్లకు పెంచినట్టుగా కేంద్ర రక్షణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది.
4. అగ్నిపథ్ పథకమనేది ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమకు లాభం చేకూరుస్తుందని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా శిక్షణ పొందిన తరవాత నాలుగేళ్లకే ఇంటికి పంపించేసినప్పుడు తమ శిక్షణ కేవలం ప్రైవేట్ సెక్యురిటీలో చేరేందుకే పనిచేస్తుందని వాపోతున్నారు.
5. ఆర్మీలో 1.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని..ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎటువంటి నియామకాలు జరపలేదని అభ్యర్ధులు అంటున్నారు. ఈ ఏడాది కూడా అంటే అగ్నిపథ్ పథకం ద్వారా కేవలం 46 వేలమందే ఎంపికవుతారు. మిగిలిన పోస్టుల సంగతేంటనేది మరో ప్రశ్న.
6. డిఫెన్స్ ఉద్యోగాలు ఆశించిన అభ్యర్ధులకు మరో అనుమానం కూడా ఉంది. ఇలా ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాల నియామకాలతో ..ప్రభుత్వ ఉద్యోగాలను పక్కనపెట్టేస్తుందంటున్నారు.
అగ్నిపథ్ పథకం ప్రకారం నాలుగేళ్ల తరువాత 25 శాతం మంది మాత్రమే పర్మినెంట్ సైనికులవుతారు. మిగిలినవారికి 11-12 లక్షల చొప్పున సెటిల్మెంట్ ప్యాకేజ్ ఇచ్చి పంపించేస్తారు. పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పథకంపై అభ్యర్ధుల ఆందోళనకు కారణమైంది.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Agnipath Scheme Details: అగ్మిపథ్‌పై ఎందుకీ ఆందోళన, కారణాలేంటి, అగ్నిపథ్ అంటే ఏంటి