జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్స్, కో ఆర్డినేటర్స్ నుంచి మొదలుపెడితే అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ వరకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల పేరిట అమ్మాయిలను వేధించే వారి సంఖ్య అధికంగానే వుందని అన్నారు జూనియర్ ఆర్టిస్టు సునీత. రెండున్నరేళ్ల క్రితం తాను కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను అలాంటి వేధింపులు ఎన్నో ఎదుర్కున్నానని చెప్పారామె. తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. నటి శ్రీ రెడ్డి చెప్పినట్టుగానే తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్ అధికంగానే వుంది అని స్పష్టంచేశారు. అంతేకాకుండా ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్, భరత్ అనే నేను సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన శేషు అనే వ్యక్తి సైతం తనని వేధించారని చెప్పుకొచ్చారామె. కత్తి మహేష్ బిగ్ బాస్ షోలో పాల్గొని ఎలిమినేట్ అయి ఇంటికి తిరిగొచ్చిన రోజున తాను ఫ్రెండ్లీగా ఫోన్ చేసి మాట్లాడానని, సోమాజీగూడలో ఓ అడ్రస్ ఇచ్చి రమ్మని పిలిస్తే వెళ్లానన్న సునీత.. అక్కడ కత్తి మహేష్ తనని కమిట్మెంట్ అడిగి అమర్యాదగా ప్రవర్తించాడని చెప్పారు. కమిట్మెంట్కి నో చెప్పాననే ఆగ్రహంతో కత్తి మహేష్ తనపై చేయి చేసుకుని ఓ గదిలోకి తోసేసి డోర్ లాక్ చేశాడని చెప్పిన సునీత ఆ తర్వాత బస్సు ఛార్జీల కోసం అని రూ.500 తన చేతిలో పెట్టి వెనక్కి పంపించారని ఆరోపించారు.
అయితే, సునీత చేసిన ఆరోపణలపై స్పందించిన కత్తి మహేష్... సునీత తనకు ఫ్రెండ్ అని, ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు తనని డబ్బులు అడిగి తీసుకుంటుందని చెప్పారు. అలా సునీతకు కొన్నిసార్లు ఆర్థిక సహాయం చేశాను కానీ ఆమె ఆరోపిస్తున్నట్టుగా తాను ఆమెను వేధించాను అనే మాటల్లో వాస్తవం లేదని ఖండించారు. అంతేకాకుండా ఒకవేళ తాను సునీతను వేధించినట్టుగా ఆమె వద్ద ఏమైనా ఆధారాలు వుంటే, నిరభ్యంతరంగా తనపై ఫిర్యాదు చేసుకోవచ్చునని కత్తి మహేష్ స్పష్టంచేశారు.
ఇక భరత్ అనే సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన శేషు తనని రెండున్నరేళ్ల క్రితం నుంచే వేధిస్తున్నట్టు సునీత ఈ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ సమయంలోనే పరిశ్రమకు కొత్తగా వచ్చిన తనను శేషు అవకాశాల పేరిట వేధించినట్టు సునీత ఆరోపించారు.
పరిశ్రమలో ఎవరికైనా, ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయించి చట్టరీత్యా ఫిర్యాదు చేయాలి కానీ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సైతం సునీత ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టుగానే తాను ఇటీవల ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ ఎస్సైకి ఫిర్యాదు చేసినా.. వారు తన ఫిర్యాదును పట్టించుకోలేదని అన్నారామె. అలాగే కత్తి మహేష్ విషయంలోనూ తాను పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తే, అప్పటికే కత్తి మహేష్‌కి పవన్ కల్యాణ్ గారికి మధ్య వివాదం నడుస్తున్నందున.. కత్తి మహేష్‌కి మీడియా సపోర్టు వుంటుందని సాకు చూపిస్తూ పోలీసులు తనని వెనక్కి పంపించినట్టు చెప్పారామె.
ఇప్పటికే నటి శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలతో తెలుగు సినీ పరిశ్రమ రోడ్డుకెక్కగా... ఆమె ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు అంటూ తాజాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ మీడియాను ఆశ్రయించడం చర్చనియాంశమైంది. శ్రీ రెడ్డి లీక్స్ అలా వుండగానే మొదలైన ఈ సునీత లీక్స్ ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాల్సిందే మరి!!