హైదరాబాద్ నుంచి ఆగ్నేయ ఆసియా దేశాల్లో 16,992 కి.మీ.ల 'రహదారి యాత్ర'ను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన నలుగురు మహిళా బైక్ రైడర్లకు తెలంగాణ పర్యాటక శాఖ ఘన స్వాగతం పలికింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక విశేషాలను దేశ విదేశాల్లో చాటిచెప్పేందుకు నలుగురు యువతులు ఫిబ్రవరి 11, 2018న తమ ప్రయాణాన్ని ప్రారంభించి మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం మరియు బంగ్లాదేశ్లలో పర్యటించారు. వీరికి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) మరియు భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చారు.
టీఎస్టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ డి.మనోహర్ మాట్లాడుతూ, రైడర్ల విజయాన్ని అభినందించారు. ఈ పర్యటనలో వారు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని తెలంగాణ పర్యాటకం, ఇన్ క్రెడిబుల్ ఇండియా గురించి వివరించారన్నారు. "ఇలాంటి ఆలోచనలతో మహిళలు ముందుకురావడం బహుశా దేశంలో మరే రాష్ట్రంలో చూడలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆలోచనలతో వచ్చే వారికి తెలంగాణ పర్యాటకం మద్దతు ఇస్తుంది" అని ఆయన చెప్పారు. మహిళా రైడర్లు మొదట భారతదేశంలోని 15 రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ తరువాత మణిపూర్ గుండా మయన్మార్ దేశంలోకి ప్రవేశించారు.
Telangana Tourism Department welcomed 4 women bikers who successfully completed 'Road to Mekong', a 16,992 km long road trip starting from Hyderabad, covering India’s neighbouring nations Myanmar,Thailand,Laos,Cambodia,Vietnam & Bangladesh, to promote tourism in India (08.04.18) pic.twitter.com/1nsZGkKR3X
— ANI (@ANI) April 8, 2018
తెలంగాణ పోలీసుల శాఖలో పనిచేస్తున్న బైక్ రైడర్లలో ఒకరైన శాంతి సుసాన్ మీడియాతో మాట్లాడుతూ.. జర్నీ అద్భుతంగా సాగిందని అన్నారు. "ఇదో అద్భుతమైన అవకాశం. ఏదో ఆవిష్కరించినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు నేను విషయాలను భిన్నంగా చూడటం మొదలుపెట్టాను. ఈ జర్నీ తరువాత ఏ సవాలునైనా ధైర్యంగా స్వీకరించవచ్చనే దానిపై నమ్మకం వచ్చింది" అని ఆమె చెప్పారు.