ప్రభుత్వం జాతీయ ఉత్పత్తి పంపిణీ ద్వారా వినియోగదారులకు అందించే నిత్యవసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాల్సిందే..! అయితే గతంలో ఈ కార్డులను పొందాలంటే స్థానిక తహసిల్దార్ కార్యాలయాల్లో లిఖిత పూర్వక దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. విచారణ పూర్తిచేసి ఓ రెండు మూడు నెలల అనంతరం కార్డును చేతికి ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను పొందేందుకు ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కార్డు జాప్యం జరగదు. మీ-సేవా కేంద్రాల ద్వారా వేగంగా రేషన్ కార్డు పొందే అవకాశం ఉంది.
దరఖాస్తు ఇలా..
* కొత్తగా రేషన్ కార్డు కావాలనుకొనేవారు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేకుండా కేవలం ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్‌తో స్థానిక మీసేవా కేంద్రానికి వెళ్లి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవా నిర్వాహుకులు ఇచ్చే రసీదును భద్రంగా ఉంచుకోవాలి.
* కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్న వివరాలను అధికారులు పరిశీలించి 'ఆన్లైన్'లోనే కార్డులను మంజూరు చేస్తారు.
* మొబైల్ నెంబర్‌కు రేషన్‌కార్డు మంజూరైనట్లు మెసేజ్ వచ్చిన తరువాత, కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కేంద్రానికి వెళ్ళి రసీదును చూపిస్తే మంజూరైన రేషన్ కార్డును డౌన్లోడ్ చేసి ఇస్తారు.
నకిలీ కార్డులకు చెక్
'ఆన్లైన్'లో రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా నకీలీ రేషన్ కార్డులకు చెక్‌పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రేషన్ షాపులు బయోమెట్రిక్ మిషన్ల ద్వారా వినియోగదారులకు వేలిముద్రల ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల బయోమెట్రిక్ విధానంలో కొందరు వినియోగదారుల వేలిముద్రలు సరిపోలకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే బయోమెట్రిక్ మిషన్లతో పాటు రేషన్ దుకాణాల్లో ఐరిష్ యంత్రాలను కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ద్వారా రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అరికట్టవచ్చని యోచిస్తోంది.