శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చిన ప్రైవేట్ జెట్ విమానం మంగళవారం రాత్రి ముంబైకి చేరుకుంది. అంధేరిలోని లోఖండ్వాలాలో వున్న గ్రీన్ ఎకరాస్ బిల్డింగ్ వద్ద అప్పటికే ఆమె అభిమానులు, బంధుమిత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎందరో శ్రీదేవి భౌతికకాయం రాకకోసం వేచిచూస్తూ నిల్చున్నారు. బోనీకపూర్, అర్జున్ కపూర్, సంజయ్ కపూర్ వెంటరాగా శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చిన అంబులెన్స్ వాహనం పోలీస్ ఎస్కార్ట్ సెక్యురిటీగా వున్న వాహనాల మధ్య రాత్రి సరిగ్గా 10:33 గంటలకు గ్రీన్ ఎకరాస్ బిల్డింగ్ ఆవరణలోకి ప్రవేశించింది. తమ అభిమాన తారను కడసారి చూసి, ఆమెకు కన్నీటి నివాళి అర్పించేందుకు గత రెండు రోజులుగా అక్కడే వున్న అభిమానులు ఒక్కసారిగా తమ కన్నీరు ఆపుకోలేకపోయారు. అందం, అభినయం కలగలిసిన అభిమాన తారను అలా నిర్జీవంగా చూడాల్సి రావడంతో అభిమానులు, సినీ ప్రముఖుల గుండెలు ఒక్కసారిగా ఏదో తెలియని బాధతో బరువెక్కాయి.
#Sridevi's mortal remains reach her Mumbai residence as thousands of fans gather to bid her adieu-by @somensharma pic.twitter.com/E7Cy8q1WiM
— dna After Hrs (@dnaAfterHrs) February 27, 2018
శ్రీదేవి నివాసం బయట భారీ సంఖ్యలో గుమిగూడిన అభిమానులని కంట్రోల్ చేయడం ముంబై పోలీసులకు కత్తిమీద సాములా మారింది. సున్నితమైన అంశం, బాధాకరమైన సందర్భం కావడంతో పోలీసులు సైతం వారిపై కఠినంగా వ్యవహరించే పరిస్థితి లేదు. దీంతో భారీగా తరలివస్తున్న అభిమానులు, జనం మధ్య అక్కడికొస్తున్న వీవీఐపీలు, ప్రముఖులకు భద్రత కల్పించడం పోలీసులకు సైతం కష్టం అవుతోంది.