Vijayawada Railway station: కాదేదీ అమ్మకానికి అనర్హం. ఇండియన్ రైల్వేకు ఇది అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఏకంగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మకానికి సిద్ధం చేసింది రైల్వే శాఖ. రీ డెవలప్‌మెంట్ పేరిట 99 ఏళ్ల లీజుకిచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇండియన్ రైల్వే ప్రైవేటీకరణ (Indian Railways privatisation) దిశగా ముందుకు సాగుతోంది. ముందు దశలవారీగా రైల్వే స్టేషన్లను రీ డెవలప్‌మెంట్ (Re Development )పేరిట లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే, అధిక ఆదాయం సమకూర్చే విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 99 ఏళ్ల లీజుకిచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
విజయవాడ రైల్వే స్టేషన్( Vijayawada Railway station)ను వాణిజ్యపరంగా హంగులతో ఆధునీకరించేందుకు ప్రైవేటు టెండర్లు పిలవాలని రైల్వే బోర్డు గతంలోనే నిర్ణయించింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కూడా కోరింది. బిడ్డర్లు ముందుకొచ్చినా రైల్వే నిబంధనల కారణంగా వెనకడుగేశారు. అప్పట్లో 30 ఏళ్ల లీజుకు ప్రతిపాదించడంతో ఉపయోగం ఉండదని బిడ్డర్లు భావించారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా రైల్వే స్టేషన్లను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏ1 రైల్వే స్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేశారు.
1888లో ప్రారంభమైన విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 10 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. కరోనాకు ముందు ప్రతిరోజూ 250 రైళ్లు నడిచేవి. ఇప్పుడు 150 రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీ గతంలో రెండు లక్షలుండగా..ఇప్పుడు లక్ష వరకూ ఉంటోంది.స్టేషన్‌లో ఇప్పుడు అన్ని రకాల సదుపాయాలున్నాయి. పది ప్లాట్‌ఫామ్స్‌ను అనుసంధానిస్తూ 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలున్నాయి. రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లున్నాయి. ఈ స్టేషన్ నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డెన్ అవార్డు సాధించి..ఐఎస్ఓ హోదా కలిగి ఉంది. విజయవాడ డివిజన్‌కు రైల్వేలో మంచి ఆదాయం కలిగిన స్టేషన్‌గా పేరుంది. నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతుంటోంది. ఇలాంటి రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం కంటే..సొంతంగా అభివృద్ధి చేసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గుజరాత్, భోపాల్ స్టేషన్లను ఇలాగే అభివృద్ధి చేసింది రైల్వే శాఖ. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే స్టేషన్ ( Railway station) ప్రైవేటీకరించే ఆలోచన తగదని అంటున్నారు.
Also read: Ap Corona virus: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, తాడికొండ ఎమ్మెల్యే పరిస్థితి ఆందోళనకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook